PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు ఆగిపోయాయా? ఈ కారణాలు తెలుసుకొని సరిచేయండి!

PM Kisan :దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ పథకంలో భాగంగా 21వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. నవంబర్ 19 బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 10 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు బదిలీ చేయనున్నారు. ఇంతకుముందు 20వ విడత డబ్బును ఆగస్టు 2న వారణాసి నుంచి ప్రధాని విడుదల చేశారు.
ఏమిటి ఈ పీఎం కిసాన్ పథకం?
పీఎం కిసాన్ పథకాన్ని 2019లో ప్రారంభించారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ రూ.6,000 ను సంవత్సరంలో మూడు విడతలుగా.. అంటే ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. ప్రతి పంట సీజన్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు మరియు ఇతర ఖర్చుల కోసం పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బు సహాయంగా ఉపయోగపడుతుంది.
డబ్బులు వస్తున్నాయో లేదో ఇలా చెక్ చేసుకోండి
మీరు పీఎం కిసాన్ పథకంలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్నా, లేదా 21వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్నా.. ముందుగా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలి.
లబ్ధిదారుల జాబితా చెక్ చేయడం:
* ముందుగా pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
* హోమ్ పేజీలో కొద్దిగా కిందకు స్క్రోల్ చేస్తే Farmers Corner అనే సెక్షన్ కనిపిస్తుంది.
* దానిలో బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయండి.
* మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం పేరును ఎంచుకోండి.
* ఆ గ్రామంలోని మొత్తం లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి.
మీ పేమెంట్ స్టేటస్ (Status) తెలుసుకోవడం:
* తిరిగి ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లండి.
* నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
* ఇక్కడ మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడీని ఎంటర్ చేయండి.
* మీకు 21వ విడత డబ్బు విడుదల చేయడానికి అనుమతి వచ్చిందా, ఇంకా పెండింగ్‌లో ఉందా, లేదా నిలిపివేయబడిందా అనే పూర్తి సమాచారం ఇక్కడ తెలుస్తుంది.
జాబితాలో పేరు లేకపోవడానికి కారణాలు ఇవే
* మీరు పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నా కూడా, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనిపించకపోవడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.
* ఆధార్ వివరాల తేడా: భూమి పత్రాలలో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు సరిపోలకపోవడం.
* తప్పు బ్యాంక్ అకౌంట్: తప్పుగా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వడం.
* eKYC పూర్తి చేయకపోవడం: ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం.
* భూమి వివరాల అప్‌డేట్: రాష్ట్ర ప్రభుత్వం తరపున భూమి రికార్డులు అప్‌డేట్ కాకపోవడం.
* అనర్హులు కావడం: మీరు ఈ పథకానికి అర్హులు కాకపోవడం (ఉదాహరణకు, మీరు పన్ను చెల్లింపుదారులు అయితే).
పైన చెప్పిన కారణాల్లో ఏదైనా లోపం ఉంటే, వెంటనే దగ్గరలోని రైతు భరోసా కేంద్రం లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే మీకు తదుపరి విడత డబ్బులు సక్రమంగా అందుతాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

