PM Kisan : 30 లక్షల మంది రైతులకు భారీ షాక్..పీఎం కిసాన్ 22వ విడత రూ.2000 ఆగిపోయే ఛాన్స్.

PM Kisan : 30 లక్షల మంది రైతులకు భారీ షాక్..పీఎం కిసాన్ 22వ విడత రూ.2000 ఆగిపోయే ఛాన్స్.
X

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలో విడుదల కాబోయే 22వ విడత డబ్బులు మీ ఖాతాల్లో పడాలంటే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది రైతులకు ఈసారి రూ.2000 నగదు అందే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం ఒక చిన్న పొరపాటు వల్ల ఈ భారీ సంఖ్యలో రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 6, 2026 నాటికి దేశవ్యాప్తంగా 30,18,361 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. దీనివల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియకు ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 లక్షల మంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా వేలాది మంది రైతుల ఖాతాలు ఆధార్‌తో లింక్ కాలేదు. ఫలితంగా వీరందరికీ 22వ విడత కింద రావాల్సిన రూ. 2000 నిలిచిపోయే ప్రమాదం ఉంది.

ఆధార్ లింక్ ఎందుకు తప్పనిసరి?

ప్రభుత్వం పంపిణీ చేసే ఏ పథకమైనా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరాలని కేంద్రం నిబంధన విధించింది. దీనికోసం బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ జోడించడం తప్పనిసరి. కేవలం ఆధార్ లింక్ ఉంటే సరిపోదు, అది బ్యాంకులో యాక్టివ్‌గా ఉండి డీబీటీకి ఆమోదం పొంది ఉండాలి. ఒకవేళ మీ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోతే, ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా టెక్నికల్ కారణాల వల్ల అవి మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ కావు.

మీరు చేయాల్సిన పనేంటి?

రైతులు తమ 22వ విడత డబ్బులు పొందాలంటే వెంటనే తమ బ్యాంక్ శాఖకు వెళ్లి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటు ఒక దరఖాస్తు ఫారమ్ నింపి ఇస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ సదుపాయం ఉన్నవారు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ లింక్ చేయవచ్చు. చాలా బ్యాంకులు ఎస్‌ఎమ్ఎస్ ద్వారా కూడా ఆధార్ లింక్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 పొందుతున్న రైతులు, ఈ చిన్న పొరపాటు వల్ల ఆ సాయాన్ని కోల్పోవద్దు. కేవలం 22వ విడత మాత్రమే కాదు, భవిష్యత్తులో వచ్చే అన్ని విడతల డబ్బులు సక్రమంగా అందాలంటే ఆధార్ సీడింగ్, ఈ-కేవైసీ ప్రక్రియలను వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో లేదా నేరుగా బ్యాంకుల్లో ఈ సమస్యను పరిష్కరించుకుని రూ.2000 పొందడానికి సిద్ధంగా ఉండండి.

Tags

Next Story