PM Kisan : రైతుల ఖాతాల్లోకి కాసుల వర్షం..హోలీ ముందే కేంద్రం భారీ గిఫ్ట్.

PM Kisan : రైతుల ఖాతాల్లోకి కాసుల వర్షం..హోలీ ముందే కేంద్రం భారీ గిఫ్ట్.
X

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తదుపరి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏడాదికి మూడు సార్లు, విడతకు రూ.2,000 చొప్పున పెట్టుబడి సాయం అందించే ఈ పథకం ద్వారా ఇప్పటికే 21 విడతల డబ్బులు రైతుల ఖాతాల్లో చేరాయి. ఇప్పుడు అందరి కళ్లు 22వ విడత పంపిణీపైనే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 24, 2026 తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వం 22వ విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. మార్చిలో వచ్చే హోలీ పండగ కంటే ముందే రైతుల చేతికి ఈ డబ్బులు అందజేయాలని కేంద్రం భావిస్తోంది. గత విడతను నవంబర్ 19, 2025న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదలవుతాయి కాబట్టి, ఫిబ్రవరి నెలాఖరులోపు రైతుల అకౌంట్‌లోకి రూ.2,000 జమ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ విడతలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. చాలా మంది రైతులకు ఈసారి రూ.2,000 కాకుండా నేరుగా రూ.4,000 జమ కానున్నాయి. ఇది ప్రభుత్వం ఇచ్చే బోనస్ ఏమీ కాదు. ఎవరైతే అర్హులైన రైతులు ఉండి, గత 21వ విడతలో సాంకేతిక కారణాల వల్ల లేదా కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల డబ్బులు అందుకోలేకపోయారో, వారికి ఈసారి పాత డబ్బులతో కలిపి మొత్తం రూ.4,000 పంపిణీ చేయనున్నారు. అంటే ఒకేసారి రెండు విడతల నిధులు వారి ఖాతాల్లోకి చేరుతాయన్నమాట. మిగిలిన రైతులకు ఎప్పటిలాగే రూ.2,000 మాత్రమే అందుతాయి.

డబ్బులు మీ అకౌంట్‌లోకి సజావుగా రావాలంటే రైతులు ఖచ్చితంగా రెండు పనులు పూర్తి చేయాలి. ఒకటి ఈ-కేవైసీ, రెండోది భూమి ధ్రువీకరణ. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కాని వారికి ప్రభుత్వం నిధులను నిలిపివేస్తోంది. మీరు పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి ఓటీపీ ద్వారా గానీ లేదా దగ్గరలోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా గానీ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. డీబీటీ సౌకర్యం యాక్టివేట్ అయి ఉండాలి.

లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

మీకు డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు:

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయండి.

* హోమ్‌పేజీలో 'Know Your Status' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

* మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

* 'Get Data' పై క్లిక్ చేస్తే మీ ఈ-కేవైసీ పూర్తి అయ్యిందో లేదో, తదుపరి విడత వస్తుందో లేదో స్పష్టంగా కనిపిస్తుంది.

Tags

Next Story