PM Kisan : పీఎం కిసాన్ 22వ విడతకు బ్రేక్? లక్షలాది మంది రైతుల పేర్లు గల్లంతు.

PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రస్తుతం తమ బ్యాంక్ ఖాతాల్లోకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నగదు ఎప్పుడు జమ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో భారీ ప్రక్షాళన చేపట్టిందన్న వార్త రైతుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో లక్షలాది మంది అనర్హులను గుర్తించి వారి పేర్లను లిస్టు నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో మీ పేరు కూడా ఆ జాబితాలో ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
అసలు రైతుల పేర్లు ఎందుకు కట్ అవుతున్నాయి? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు రెండు ప్రధాన కారణాల రీత్యా పేర్లను తొలగిస్తున్నారు. మొదటిది, భూమి యాజమాన్య హక్కులకు సంబంధించినది. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని తమ పేరు మీదకు మార్చుకున్న రైతుల పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా భూమి బదిలీ జరిగిందని తేలితే వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు.
రెండో కారణం ఏమిటంటే.. ఒకే కుటుంబంలో ఒకరికి మించి లబ్ధి పొందడం. చాలా చోట్ల భార్యాభర్తలిద్దరూ లేదా కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వేర్వేరుగా ఈ 2000 రూపాయల నగదును తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ సాయం అందుతుంది. ఇలా తప్పుడు పద్ధతిలో డబ్బులు పొందుతున్న వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో తీసుకున్న సొమ్మును కూడా రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
మరి ఆగిపోయిన వాయిదాల డబ్బులు మళ్ళీ వస్తాయా? అనే సందేహానికి వ్యవసాయ శాఖ సమాధానమిచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరికి క్షేత్రస్థాయిలో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ తనిఖీలో రైతు అర్హుడు అని తేలితే, ఆగిపోయిన పాత కిస్తీలతో సహా మొత్తం సొమ్మును ఒకేసారి ఖాతాలో జమ చేస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతులు వేచి ఉండక తప్పదు.
మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి మీరు నేరుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అక్కడ హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఇస్తే మీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఏదైనా లోపం ఉంటే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 22వ విడత నగదు విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి మొదటి వారంలో లేదా హోలీ పండుగకు కానుకగా ప్రభుత్వం ఈ రూ.2000 నగదును రైతుల ఖాతాల్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లోపే ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
