PM Kisan Scheme: పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఈ 5 కారణాలు కావొచ్చు

PM Kisan Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 21వ విడత నిధులు నవంబర్ 19న విడుదలయ్యాయి. ఈ విడతలో సుమారు 9 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మొత్తం రూ.18,000 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అయితే గత విడతల్లో దాదాపు 10 కోట్ల మంది రైతులకు డబ్బు అందింది. కానీ 21వ విడతలో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్నప్పటికీ చాలా మంది రైతులకు ఈసారి డబ్బు రాలేదు. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి.
పీఎం కిసాన్ పథకానికి అనర్హులు ఎవరు?
ఈ పథకం ప్రధానంగా వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ వర్తిస్తుంది. అయినప్పటికీ, కింది వారికి వ్యవసాయ భూమి ఉన్నా కూడా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అనర్హులుగా పరిగణిస్తారు.. వారిలో..
* వృత్తిపరమైన ఉద్యోగులు: వృత్తిపరమైన పనులు చేసేవారు.
* ప్రజా ప్రతినిధులు: ప్రస్తుతం మరియు గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మొదలైన ప్రజా ప్రతినిధులు.
* ప్రభుత్వ ఉద్యోగులు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.
* పెన్షనర్లు: నెలవారీ రూ. 10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు.
* ఐటీ చెల్లింపుదారులు: ఆదాయపు పన్ను చెల్లించేవారు.
ఈ రైతులకు కూడా డబ్బు రాదు
పైన పేర్కొన్న అనర్హుల జాబితా కాకుండా, ఈ కింది మూడు అంశాలు చాలా మంది రైతులకు తెలియక గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ కారణాల వల్ల కూడా డబ్బు రాకపోవచ్చు. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత భూమి యాజమాన్యం పొందిన రైతులు ఈ పథకానికి అనర్హులు.తల్లిదండ్రులు బతికి ఉండగానే వారి నుంచి భూమిని తమ పేరు మీదకు బదిలీ చేసుకున్న రైతులకు పీఎం కిసాన్ డబ్బు అందదు. ఒకే కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ పథకానికి నమోదు చేసుకునే అవకాశం లేదు.
ముఖ్యమైన సాంకేతిక సమస్యలు
సాంకేతిక కారణాల వల్ల కూడా చాలా మంది రైతులకు నిధులు నిలిచిపోతాయి. ఈ సమస్యలను వెంటనే సరిదిద్దుకోవాలి. పథకంలో నమోదు చేసుకున్న తర్వాత ఒక్కసారి కూడా eKYC చేయించకపోతే డబ్బులు రావు. ఇప్పుడు eKYC తప్పనిసరి చేశారు. పథకానికి ఇచ్చిన బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉంటే నిధులు జమ కావు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ కాకపోయినా లేదా ఆధార్ సమాచారం సరిగా లేకపోయినా డబ్బులు ఆగిపోతాయి.
లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి
మీరు పీఎం కిసాన్ పథకానికి అర్హులే అయినా డబ్బు రాకపోతే ముందుగా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అధికారిక వెబ్‌సైట్ చిరునామా: pmkisan.gov.in/... వెబ్‌సైట్‌లో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది. అందులో బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేయడం ద్వారా మీ గ్రామంలోని లబ్ధిదారులందరి జాబితాను మీరు చూడవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

