Modi Wang Yi meeting: ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ..

Modi Wang Yi meeting:  ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ..
X
కీలకమైన విషయాలపై చర్చ

భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్లో జిన్పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. సున్నిత అంశాలను గౌరవించడం, పరస్పర ప్రయోజనాల ద్వారా ఇది సాధ్యమైంది. చైనాలోని టియాంజిన్లో నిర్వహించనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్పింగ్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. భారత్, చైనాల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయి” అని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ తన వ్యాఖ్యలలో టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావించారు. SCO అనేది ఇండియా – చైనా రెండూ క్రియాశీల సభ్యులుగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతీయ వేదిక. దీని ద్వారా రెండు దేశాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై కలిసి పనిచేస్తాయి. చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అజిత్ డొబాల్ అధికారికంగా ప్రకటించారు.

తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదం తర్వాత భారతదేశం – చైనా మధ్య సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరుదేశాలు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాయి. గత సంవత్సరం కజాన్‌లో జరిగిన సమావేశం, ఆ తర్వాత జరిగిన దౌత్య చర్చలు రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

Tags

Next Story