PM Modi: ఆర్ఎస్ఎస్ ఆధునిక అక్షయ వటవృక్షం

ఆరెస్సెస్ భారతీయ సంస్కృతి, ఆధునికతలకు వట వృక్షం (మర్రిచెట్టు) వంటిదని ప్రధాని మోదీ అభివర్ణించారు. సేవకు పర్యాయపదం ఆరెస్సెస్ అని ప్రశంసించారు. గత వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన తపస్సు ఫలాలు దేశం ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా పయనిస్తున్న తరుణం లో కనిపిస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి 75 ఏండ్ల వేడుకలు జరుగుతున్న సమయంలో ఆరెస్సెస్ వందేళ్లు పూర్తి చేసుకుంటున్నదని చెప్పారు. మోదీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత మొదటిసారి ఆదివారం నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. మహాకుంభమేళాలో సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పని చేశారని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు కారణంగానే నేడు దేశం వికసిత్ భారత్ దిశగా సాగుతూ మంచి ఫలాలు ఇస్తుందన్నారు.
దేశ ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని మోడీ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. ఇక జనరిక్ ఔషధ కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకగా మందులు లభిస్తున్నాయని చెప్పారు. దీంతో వేల కోట్లలో ప్రజల సొమ్ము ఆదా అవుతోందని తెలిపారు.ఎయిమ్స్‌ను మూడు రెట్లు పెంచామని.. నిపుణులైన వైద్యలను ప్రజలకు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోడీ పేర్కొన్నారు. అంతకుముందు ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లి, ఆయనకు, గోల్వాల్కర్‌కు నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ‘దీక్ష భూమి’ని సందర్శించారు. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, నిస్వార్థంగా సేవ చేయడమే తమ సంస్థ సిద్ధాంతమని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com