PM RAHAT Scheme: మోదీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. యాక్సిడెంట్ బాధితుల కోసం పీఎం రాహత్ షురూ

PM RAHAT Scheme: మోదీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. యాక్సిడెంట్ బాధితుల కోసం పీఎం రాహత్ షురూ
X

PM RAHAT Scheme: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. దీని పేరే పీఎం రాహత్. ప్రమాదం జరిగిన వెంటనే ఆ మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో సరైన వైద్యం అందితే దాదాపు 50 శాతం మరణాలను ఆపవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే డబ్బు లేదనే కారణంతో ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ప్రతి బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందుతుంది.

ఈ పథకం ఎలా పనిచేస్తుందంటే.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు, లేదా అక్కడ ఉన్నవారు ఎవరైనా సరే 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. దీని ద్వారా వెంటనే అంబులెన్స్ సాయం అందడమే కాకుండా, దగ్గరలోని నిర్ణీత ఆసుపత్రుల వివరాలు కూడా తెలుస్తాయి. ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఈ చికిత్స సౌకర్యం ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి 48 గంటల వరకు, సాధారణ గాయాలైన వారికి 24 గంటల వరకు తక్షణ స్థిరీకరణ చికిత్స అందిస్తారు.

చికిత్స ఖర్చుల చెల్లింపు ప్రక్రియ కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. ఒకవేళ వాహనానికి ఇన్సూరెన్స్ ఉంటే, ఆ బీమా కంపెనీలు ఖర్చును భరిస్తాయి. ఇన్సూరెన్స్ లేని వాహనాలు లేదా హిట్ అండ్ రన్ కేసుల విషయంలో భారత ప్రభుత్వమే నేరుగా బడ్జెట్ నిధుల నుంచి ఆసుపత్రులకు నగదు చెల్లిస్తుంది. చికిత్స పూర్తయిన తర్వాత క్లెయిమ్ చేసిన 10 రోజుల్లోనే ఆసుపత్రులకు డబ్బులు రీయింబర్స్ అయ్యేలా ప్రభుత్వం డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆసుపత్రులు కూడా చికిత్స చేయడానికి వెనుకాడవు.

ఈ పథకం పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పనిచేస్తుంది. పోలీసుల ధృవీకరణ, ఆసుపత్రిలో చేరిక, మెడికల్ మేనేజ్‌మెంట్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ప్రధాని మోదీ తన కార్యాలయాన్ని కొత్త భవనానికి మార్చిన తర్వాత తీసుకున్న మొదటి నిర్ణయం ఇదే కావడం విశేషం. ఈ పథకం ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని రవాణా శాఖా మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags

Next Story