PM Surya Ghar Yojana : కరెంటు బిల్లుకు ఇక కాలం చెల్లింది.. పైసా ఖర్చు లేకుండా ఇంటినే పవర్ హౌస్‌గా మార్చేసుకోండి.

PM Surya Ghar Yojana : ప్రతినెలా వచ్చే కరెంటు బిల్లు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్ల వాడకంతో బిల్లు చూసి తల పట్టుకోవాల్సిందే. అయితే, ఈ టెన్షన్ నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన అనే అదిరిపోయే స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం ద్వారా కరెంటు బిల్లును సున్నా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీని కూడా పొందవచ్చు.
ఈ పథకం కింద మీ ఇంటి డాబాపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం భారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. మీరు ఏర్పాటు చేసుకునే ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి ఈ సబ్సిడీ ఉంటుంది. ఉదాహరణకు, మీరు 1 కిలోవాట్ ప్లాంట్ పెడితే రూ.30,000, 2 కిలోవాట్లు అయితే రూ.60,000 చొప్పున ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో వేస్తుంది. అదే 3 కిలోవాట్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. దీనివల్ల సోలార్ ప్యానెల్స్ ఖర్చులో సగం భారం ప్రభుత్వం పంచుకుంటుంది.
సబ్సిడీ పోను మిగిలిన డబ్బు కోసం మీరు టెన్షన్ పడాల్సిన పనిలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకులు సోలార్ లోన్లను చాలా తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. కేవలం 5.75% వార్షిక వడ్డీతో రూ.2 లక్షల వరకు రుణం పొందవచ్చు. అంతకంటే ఎక్కువ అవసరమైతే రూ.6 లక్షల వరకు కూడా లోన్ ఇస్తారు (దీనికి 7.90% వడ్డీ ఉంటుంది). ముఖ్యమైన విషయం ఏంటంటే, రూ.2 లక్షల లోన్ కోసం మీరు బ్యాంకుకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వక్కర్లేదు, మీ జీతం స్లిప్పులు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో కేవలం 15-20 నిమిషాల్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఈ స్కీమ్ కింద లోన్ పొందాలంటే మీకు 21 ఏళ్లు నిండి ఉండాలి. మీ పేరు మీద కరెంటు కనెక్షన్, సొంత ఇల్లు (ప్యానెల్స్ పెట్టడానికి మేడపై ఖాళీ స్థలం) ఉండాలి. సిబిల్ స్కోర్ 680 కంటే ఎక్కువగా ఉండటం అవసరం. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పాత కరెంటు బిల్లు, సోలార్ వెండర్ నుంచి తీసుకున్న కొటేషన్ ఉంటే సరిపోతుంది. ఒక్కసారి ప్యానెల్స్ బిగించిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ లోన్ తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది. పైగా మొదటి 6 నెలల పాటు ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు.
ఈ పథకంలో మరో అద్భుతమైన ఫీచర్ నెట్ మీటరింగ్. మీ సోలార్ ప్యానెల్స్ తయారు చేసిన విద్యుత్తులో మీ వాడకం పోను మిగిలిన కరెంటును ప్రభుత్వ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. దీనికి ప్రతిఫలంగా కరెంటు శాఖ మీకు డబ్బులు చెల్లించడం లేదా మీ బిల్లులో క్రెడిట్ ఇవ్వడం చేస్తుంది. ఫలితంగా మీ కరెంటు బిల్లు జీరో అవ్వడమే కాకుండా, మీరు కరెంటు అమ్మడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు వెంటనే pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
