PM SVANidhi: వీధి వ్యాపారులకి ఆసరాగా కేంద్రం అద్భుత పథకం.

PM SVANidhi: భారతదేశంలో వీధుల వెంట చిన్న వ్యాపారాలు చేసుకునే లక్షలాది మంది చిరు వ్యాపారులకు పెట్టుబడి అనేది పెద్ద సమస్య. వడ్డీ వ్యాపారుల దగ్గర భారీ వడ్డీలకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చి, వారి వ్యాపారాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం స్వనిధి పథకం. ఇది ఎలాంటి ఆధారం లేకుండా, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే మైక్రోఫైనాన్స్ పథకం.
ఏమిటీ ఈ పీఎం స్వనిధి పథకం?
ఈ పథకాన్ని 2020లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం వీధి వ్యాపారులు తమ వ్యాపారాల కోసం సులభంగా, తక్కువ వడ్డీకి రుణం పొందడం. మొదట్లో ఈ పథకం 2024 డిసెంబర్ 31 వరకు మాత్రమే అమలులో ఉండాలని నిర్ణయించారు. అయితే, చిరు వ్యాపారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుండటంతో, కేంద్రం ఈ పథకాన్ని ఏకంగా ఆరు సంవత్సరాలు పొడిగించింది. అంటే ఇప్పుడు 2030 డిసెంబర్ 31 వరకు ఈ పథకం అమలులో ఉంటుంది.
ఎంత రుణం లభిస్తుంది?
ఈ పథకం కింద చిరు వ్యాపారులకు మొదటిసారిగా రూ.10,000 వరకు రుణం ఇస్తారు. మీరు ఈ రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లిస్తే, రెండోసారి రూ.20,000 వరకు, ఆ తర్వాత మూడోసారి రూ.50,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలపై కేవలం 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. బయట వడ్డీ వ్యాపారుల దగ్గర సంవత్సరానికి 100 శాతం వరకు వడ్డీ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ కేవలం 7 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు?
పీఎం స్వనిధి పథకం ద్వారా రుణం పొందాలంటే, వీధి వ్యాపారులు కచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.
* పట్టణ స్థానిక సంస్థలు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
* మున్సిపల్ అధికారులు నిర్వహించిన సర్వే జాబితాలో మీ పేరు నమోదై ఉండాలి.
* ఒకవేళ సర్వేలో మీ పేరు లేకపోయినా, సర్వే తర్వాత మీరు వ్యాపారం ప్రారంభించినా, స్థానిక సంస్థల నుంచి సిఫార్సు లేఖ ఉంటే సరిపోతుంది.
* పైన చెప్పిన వాటిలో ఏదో ఒక పత్రం ఉంటే చాలు. అదనంగా మీ కేవైసీ కోసం ఈ కింది పత్రాలు అవసరం అవుతాయి:
* ఆధార్ కార్డు
* ఓటరు ID కార్డు
* డ్రైవింగ్ లైసెన్స్
* ఉపాధి హామీ కార్డు
* పాన్ కార్డు
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సిఫార్సు లేఖ కోసం మీకు కావాల్సిన పత్రాలు:
* బ్యాంక్ పాస్‌బుక్ లేదా అకౌంట్ స్టేట్‌మెంట్
* మీరు వ్యాపారి అని నిరూపించే ఏదైనా పత్రం
* మున్సిపల్ కార్పొరేషన్‌కు సమర్పించిన అభ్యర్థన పత్రం
ఎలా దరఖాస్తు చేయాలి?
* పీఎం స్వనిధి యోజన కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం.
* ముందుగా, pmsvanidhi.mohua.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* హోమ్ పేజీలో, 'లాగిన్' బటన్‌ను నొక్కి, అందులో Applicant అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
* లాగిన్ పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి.
* తర్వాత, మీరు ఏ రకమైన వ్యాపారి అనే కేటగిరి ఎంచుకోవాలి.
* మీ సర్వే రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేసి, అక్కడ అడిగిన సమాచారం అంతా సరిగా నింపి, దరఖాస్తును పూర్తి చేయవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com