PM Vidyalaxmi Yojana : పీఎం విద్యాలక్ష్మి స్కీమ్.. తక్కువ వడ్డీకే రూ. 10 లక్షల ఎడ్యుకేషన్ లోన్.

PM Vidyalaxmi Yojana : చాలా మంది టాలెంటెడ్ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకంలో విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే ఎడ్యుకేషన్ లోన్ అందిస్తారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
పీఎం విద్యాలక్ష్మి యోజన కింద అర్హత ఉన్న విద్యార్థికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఈ లోన్‌పై వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంక్ నిర్ణయించే EBLRకి 0.5% అదనంగా ఉంటుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న విద్యార్థులకు వడ్డీ రేటులో 3% రాయితీ లభిస్తుంది.
వార్షిక కుటుంబ ఆదాయం రూ.4,50,000 కన్నా తక్కువ ఉన్న విద్యార్థులు, పీఎం యూఎస్‌పీ సీఎస్‌ఐఎస్ పథకం కింద ఇంజినీరింగ్ వంటి సాంకేతిక లేదా వృత్తిపరమైన కోర్సులు చదివితే వారికి వడ్డీలో పూర్తి మినహాయింపు లభిస్తుంది.
డిగ్రీ ఆ పైన ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే విద్యార్థులు అర్హులు. ప్రభుత్వం గుర్తించిన 800కు పైగా ఉన్నత విద్యా సంస్థల్లో కోర్సులో చేరి ఉండాలి. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి లోన్ లభించదు. లోన్ మంజూరైన రోజు నుంచి కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం వరకు కాలాన్ని మోరటోరియం పీరియడ్‌గా పరిగణిస్తారు. ఈ కాలంలో వడ్డీ లెక్కించినా, చెల్లించాల్సిన అవసరం లేదు. మోరటోరియం పూర్తయ్యాక, లోన్‌ను తిరిగి చెల్లించడానికి 15 ఏళ్ల వరకు సమయం ఇస్తారు. వడ్డీ రాయితీ పొందే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉండకూడదు.
పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఆన్‌లైన్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
* ముందుగా పీఎం విద్యాలక్ష్మి యోజన యొక్క అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి: pmvidyalaxmi.co.in/
* వెబ్‌సైట్‌లో, విద్యార్థిగా రిజిస్ట్రేషన్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.
* లాగిన్ అయిన తర్వాత Apply for Education Loan అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అక్కడ అడిగిన వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లు (ఆదాయ ధృవీకరణ పత్రాలు, అడ్మిషన్ లెటర్ వంటివి) అన్నీ అప్‌లోడ్ చేసి, దరఖాస్తును సమర్పించాలి.
* దరఖాస్తును సమర్పించిన తర్వాత, బ్యాంకులు మీ అప్లికేషన్‌ను పరిశీలించి లోన్ మంజూరు చేస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

