Rajnath Singh: పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలి..

Rajnath Singh: పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలి..
X
పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపు..

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రామ్‌బన్‌ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన భాజపా ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేవాసులు భారత్‌లో కలిసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ మాదిరి తాము వారిని విదేశీయుల్లా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని తెలిపారు.

‘‘జమ్మూకశ్మీర్‌లో భాజపాకు మద్దతు ఇస్తే.. స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. మాకు పాకిస్థాన్‌తో కలిసి ఉండటం ఇష్టం లేదు.. భారత్‌కు వెళ్తామని పీవోకేలోని ప్రజలూ చెప్పేంత అభివృద్ధి చేస్తాం. పీవోకేను పాక్‌ ఓ విదేశీ భూభాగంగా పరిగణిస్తోంది. దాయాది దేశంలోని అదనపు సొలిసిటర్ జనరల్‌ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఓ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అక్కడి ప్రజలను పాకిస్థాన్‌ విదేశీయులుగా చూస్తోంది. కానీ, భారత్‌ అలా కాదు. సొంత మనుషుల్లా భావిస్తోంది. మాతో వచ్చి చేరండి’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తుపై కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు. భాజపా ఉన్నంతవరకు జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ అసాధ్యమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌ భద్రత పరిస్థితిలో మంచి మార్పు వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో (సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1) పోలింగ్‌ నిర్వహించనున్నారు. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags

Next Story