Rajnath Singh : పోరాటం లేకుండానే పీఓకే భారత్‌లో కలుస్తుంది - రాజ్‌నాథ్ సింగ్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదో ఒక రోజు ఎటువంటి దాడి అవసరం లేకుండానే భారత్‌లో కలిసిపోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మొరాకోలో పర్యటిస్తున్న ఆయన అక్కడి ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం పీఓకేలో ప్రజలే స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారు అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఐదేళ్ల క్రితం కాశ్మీర్ లోయలో జరిగిన ఒక ఆర్మీ కార్యక్రమంలో కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని ఆయన గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వం పీఓకేను తిరిగి తీసుకు వచ్చే అవకాశాలను కోల్పోయిందని ప్రతిపక్షాలు విమర్శించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రస్తుతం రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మొరాకోలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కొత్త రక్షణ తయారీ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. ఆఫ్రికాలో ఏర్పాటు అవుతున్న తొలి భారత రక్షణ తయారీ ప్లాంట్ ఇదే కావడం విశేషం. రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు, పీఓకే తిరిగి భారత్‌లో కలిసే రోజు దూరంలో లేదన్న నమ్మకాన్ని మరింత బలపరిచాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com