Uttar Pradesh : రాహుల్, ప్రియాంకలను అడ్డుకున్న పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంభల్ వెళ్లకుండా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. ఘాజీపూర్ సరిహద్దులోనే పోలీసులు అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రావడంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డగించారు. దీంతో ఘాజీపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను ఏర్పాు చేశారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఓ మసీదు ఉన్న స్థానంలో ఆలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన కోర్టు సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com