S Jaishankar: కెనడా, పాక్ లకు జైశంకర్ చురకలు
భారత్-కెనడా మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ సౌలభ్యం’ ఆధారంగా హింస, ఉగ్రవాదంపై ప్రతిస్పందన ఉండకూడదని పేర్కొన్నారు. ‘ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదంటూ హితవు పలికారు.
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హింస, ఉగ్రవాదాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సందర్భంగా కెనడాకు పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస వంటి వాటికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై ఉండకూడదని హితవు పలికారు. అంతర్జాతీయ నిబంధనలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవవించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన జై శంకర్.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వివిధ దేశాలకు హితవు పలికారు.
ఈ సందర్భంగా అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. కొన్ని దేశాలు ప్రపంచ ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయని.. అయితే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ నియమాలను పాటిస్తుందని స్పష్టం చేశారు. అందరూ అనుకుంటే న్యాయమైన, సమానమైన, ప్రజాస్వామ్య క్రమం తప్పకుండా వస్తుందన్నారు. భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జై శంకర్ గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ అంశంపై ఇటీవల పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో చేసిన వ్యాఖ్యలు, ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను ఉద్దేశించి జైశంకర్ ఈ విధంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగానే బ్రిక్స్ సదస్సు, జీ 20 సమావేశాలు, చంద్రయాన్ 3 విజయం సహా వివిధ అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. టీకాల విషయంలో వర్ణ వివక్ష వంటి అన్యాయాలను మళ్ళీ అనుమతించకూడదన్నారు. వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి సరికాదన్నారు. పేద దేశాల నుంచి ధనిక దేశాల వరకు ఆహారం, ఇంధనం అందించేందుకు మార్కెట్ శక్తులను ఉపయోగించకూడదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com