PPF Scheme : ఈ స్కీమ్ ద్వారా 15 ఏళ్లలో రూ. 40 లక్షలకు పైగా ఆదాయం.. ప్రతి నెలా ఎంత కట్టాలి?

PPF Scheme : ఈ స్కీమ్ ద్వారా 15 ఏళ్లలో రూ. 40 లక్షలకు పైగా ఆదాయం.. ప్రతి నెలా ఎంత కట్టాలి?
X

PPF Scheme : ప్రభుత్వ మద్దతుతో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం చాలామందికి సురక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది. పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో లభించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకునే, ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి పీపీఎఫ్ బెస్ట్. అయితే, ఈ పథకంలో నెలకు లేదా సంవత్సరానికి గరిష్టంగా ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? కేవలం 15 సంవత్సరాలలో ఏకంగా రూ. 40 లక్షలకు పైగా ఆదాయం ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.

పీపీఎఫ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఖాతా తెరవడానికి అందుబాటులో ఉంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తుంది. అంటే, కనీసం 15 సంవత్సరాలు పెట్టుబడి కొనసాగించాలి. మెచ్యూరిటీ తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా పెట్టుబడిని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పెట్టుబడి కాలాన్ని పొడిగించుకోవచ్చు.

పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి కనిష్ట, గరిష్ట పరిమితులు ఉన్నాయి. పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని సంవత్సరంలో ఒకేసారి కట్టవచ్చు లేదా 12 వాయిదాలలో కూడా చెల్లించవచ్చు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం పెట్టుబడి రూ. 1.5 లక్షలు మించకూడదు.

ప్రస్తుత వడ్డీ రేటును (7.1%) ఆధారంగా చేసుకొని, పీపీఎఫ్ లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో చూద్దాం. మీరు సంవత్సరానికి కేవలం రూ. 500 మాత్రమే చెల్లిస్తే, 15 సంవత్సరాలలో మీరు మొత్తం రూ. 7,500 పెట్టుబడి పెడతారు. దీనికి మీకు వచ్చే రాబడి రూ. 13,561 ఉంటుంది. మీరు సంవత్సరానికి రూ. 1.5 లక్షల చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 40,68,209 లభిస్తుంది.

15 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత కూడా మీరు పెట్టుబడిని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పొడిగించుకుంటూ పోతే, మీ పెట్టుబడి కాలం 50 సంవత్సరాల వరకు కొనసాగితే, మొత్తం విలువ రూ. 6.75 కోట్లను దాటుతుందని అంచనా. పీపీఎఫ్ పథకం వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో (మూడు నెలలకు ఒకసారి) ప్రభుత్వం ద్వారా సమీక్షిస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకానికి 7.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. వడ్డీ రేటు పెరిగితే రాబడి పెరుగుతుంది, తగ్గితే రాబడి తగ్గుతుంది. ఈ పథకం కింద సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags

Next Story