Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌తో ఒప్పందం పార్టీలకు లాభమా? నష్టమా?

Prashant Kishor (tv5news.in)

Prashant Kishor (tv5news.in)

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌తో టీఆర్‌ఎస్‌ ఒప్పందంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌తో టీఆర్‌ఎస్‌ ఒప్పందంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఐప్యాక్‌తో ఒప్పందం వల్ల లాభం ఎలా ఉన్నా.. నష్టం మాత్రం తప్పదంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. గత అనుభవాల దృష్ట్యా.. పలు పార్టీల నేతలు ఇప్పుడు దీనిపైనే చర్చించుకుంటున్నారు. జాతీయ మీడియా వర్గాల్లో కూడా ఇదే టాపిక్‌.

ఐప్యాక్‌తో కలిసి పని చేయడం వల్ల తలెత్తే పరిణామాలను టీఎంసీ, జేడీయూ, వైఎస్సార్‌ టీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఐప్యాక్‌తో లాభం ఎలా ఉన్నా.. కొంత మేర నష్టం ఏర్పడుతుందనేది ఆయా పార్టీల కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా పార్టీతో పీకేతో ఒప్పందం చేసుకుంటే.. ఆ పార్టీలో పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. కానీ అదే ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందనేది పలువురి అభిప్రాయం.

2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి ఇలాంటి నష్టమే జరిగింది. ఐప్యాక్‌ కారణంగా యూపీ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు, గొడవలు తలెత్తాయి. అవి కాస్తా.. ఆర్థిక వ్యవహారాల్లో గందగోళం సృష్టించి.. చివరకు కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఐప్యాక్‌ వ్యవహార శైలితో బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్లు రెండు వర్గాలుగా చీలిపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఒకదశలో అయితే ఐప్యాక్‌తో తెగతెంపులు చేసుకునే వరకు వెళ్లింది టీఎంసీ. బిహార్‌లో ఐప్యాక్‌తో కలిసి నడిచిన జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీలోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. ఆ పార్టీ నేతల్లో విభేదాలకు కారమైంది. దీంతో చివరకు పార్టీ నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ను సీఎం నితీష్‌ సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ ప్రారంభించేలా షర్మిలను ప్రోత్సాహించింది ప్రశాంత్‌ కిషోరేనని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది.

షర్మిల పెట్టిన వైఎస్సార్‌ టీపీ కోసం కొంత మంది సిబ్బందిని నియమించి.. ఆ తర్వాత షర్మిలకు, ఆ పార్టీకీ ముఖం చాటేశారనే ఆరోపణలు ప్రశాంత్‌ కిషోర్‌పై లేకపోలేదు. ఇప్పుడు తాజాగా టీఆర్‌ఎస్‌, ఐప్యాక్‌ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రాబోయే పరిణామాలపై పలు రాజకీయ పార్టీల నేతలు, జాతీయ మీడియాల్లో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.

ఇటు పీకే ప్రతిపాదనలు, పార్టీలో చేరికపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు పలు కోణాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పీకే ఇచ్చిన ప్రతిపాదనలపై ఆ పార్టీ నేతల ప్రత్యేక కమిటీ.. సోనియా గాంధీకి నివేదిక ఇచ్చింది. ఏకే ఆంటోని, ద్విగిజయ సింగ్‌, జైరాం రమేష్‌, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు నేతలు... సోనియా ముందు తమ అభిప్రాయాలను ఉంచారు.

పీకేతో కలిసి నడిస్తే పార్టీకి ఏమేరకు లాభం ఉంటుంది...? ఎంత నష్టం జరుగుతుందనేది చర్చ జరుగుతోంది. అలాగే పీకే పనిచేసిన రాష్ట్రాల్లోని ఆయా పార్టీల పరిస్థితిని అంచనా వేసినట్లు సమాచారం. పీకే చేరికతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలోనూ పెద్ద ఎత్తున విభేదాలు వచ్చే అవకాశం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story