MP: ఆసుపత్రి పడకపై భర్త మృతి..

మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే లాల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com