Priyanka Gandhi : రెజ్లర్లను కలిసేందుకు ప్రధానికి 5 నిమిషాల టైమ్ దొరకలేదా? : ప్రియాంక గాంధీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఫైరయ్యారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంబాలలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మన దేశ స్టార్ రెజర్లు అసలు ఏం చేశారు..? న్యాయం కోసం రోడ్డుపై నిరసనలు తెలిపారు. అయినా, రెజ్లర్లను కలవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి 5 నిమిషాల సమయం కూడా దొరకలేదు. ఇంతవరకు ఆయన ఒక్కసారి కూడా వారితో సమావేశం కాలేదు. రెజ్లర్లను బీజేపీ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఒలింపిక్స్‌లో ఏం జరిగిందో ప్రజలంతా చూశారు. ఆత్మగౌరవం కోసం మీరంతా పోరాడుతున్నారు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఇంతవరకు మీకోసం మోదీ సర్కార్ ఏమీ చేయలేదు. హరియాణా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే భాజపా ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది’ అంటూ ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగ మార్పు గురించి కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, అలాంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని హరియాణా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. కాగా, హర్యానాలో అక్టోబర్ 5న మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com