Pune Road Rage: కారుకు సైడ్ ఇవ్వలేదని.. మహిళ జుట్టు లాగి ముక్కుపై కొట్టి..
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన పోర్షే కారు ప్రమాదం ఘటన ఇంకా మరవక ముందే ఆ నగరంలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇవ్వకుండా స్కూటర్ నడుపుతోందన్న ఆగ్రహంతో ఓ మహిళపై దాడిచేసి పిడిగుద్దులు కురిపించిన వ్యక్తిని, ఆయన భార్యను పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. స్కూటర్‌పై వెళ్తున్న డిజిటల్ కంటెంట్ రైటర్ జెర్లీన్ డిసిల్వా తనకు ఓవర్‌టేక్ చేసే అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో కారు ఆపిన స్వప్నిల్ కేక్రే మహిళ వద్దకు వెళ్లి జుట్టు పట్టుకుని లాగి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై రక్తం కారింది.
తనపై జరిగిన దాడికి సంబంధించి జెర్లిన్ ఓ వీడియోను విడుదల చేసింది. పాషాన్-బానెర్ లింక్ రోడ్డులో తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా నిందితుడు కేక్రే కారు రెండు కిలోమీటర్ల పాటు తన వెనక వేగంగా వచ్చిందని పేర్కొన్నారు. దీంతో తాను రోడ్డు పక్కకు తప్పుకుని కారుకు దారిచ్చానని, తన స్కూటర్‌ను ఓవర్ టేక్ చేసిన నిందితుడు కారు ఆపి కోపంగా వచ్చి తన ముక్కుపై రెండుసార్లు గుద్దాడని, తన జుట్టు పట్టుకుని లాగాడని పేర్కొంది.
తన ఇద్దరు పిల్లలు చూస్తున్నా అతడు లెక్క చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నగరం ఇంత సురక్షితమా? అని వాపోయింది. మనుషులు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారవుతున్నారని ప్రశ్నించింది. తనతో ఉన్న పిల్లలకు ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. తనకో మహిళ సాయం చేసిందని పేర్కొంది. ఈ ఘటనతో పిల్లలు భయపడిపోయారని పేర్కొంది. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతడి భార్యను అరెస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com