PUTIN: 'సబ్కా సాథ్ సబ్కా వికాస్'

న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య 23వ వార్షిక సమావేశం ఇక్కడ ప్రారంభమైంది. రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక సహకారం వంటి కీలక రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశ లక్ష్యం. నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఉదయం, రాజ్‌ఘాట్ సందర్శించిన పుతిన్ మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. రాజ్‌ఘాట్‌కు చేరుకునే ముందు, పుతిన్‌కు రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఇరు దేశాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. రష్యా నుంచి రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వంటి ఉన్నతాధికారులు పుతిన్‌తో వచ్చారు.
ఏయే ఒప్పందాలు చేసుకున్నారు?
ఇరుదేశాల మధ్య సహకారం, వలసలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, ఆహార భద్రత, ప్రమాణాలు, సముద్ర సహకారం, ఎరువులు, పోలార్ షిప్స్‌పై ఒప్పందాలు కుదిరాయి. "ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మా ఉమ్మడి ప్రాధాన్యం. దీనిని సాధించడానికి, ఈ రోజు మేం 2030 వరకు ఆర్థిక సహకార కార్యక్రమానికి అంగీకరించాం. ఇది మన వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యభరితంగా, సమతుల్యంగా, స్థిరంగా చేస్తుంది. "ఇవాళ భారత్-రష్యా బిజినెస్ ఫోరమ్‌కు హాజరయ్యే అవకాశం నాకు, అధ్యక్షుడు పుతిన్‌కు లభించింది. ఈ ఫోరమ్ మా వ్యాపార సంబంధాలకు కొత్త బలాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.
ఇది ఎగుమతులు, సహ-ఉత్పత్తి, సహ-నవీకరణకు కొత్త ద్వారాలను కూడా తెరుస్తుంది. రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడం మా ప్రాధాన్యత. ఐఎన్ఎస్టీసీ, నార్తర్న్ సీ రూట్, చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్‌లో కొత్త శక్తితో మేం ముందుకు సాగుతాం. ధ్రువ జలాల్లో భారతీయ నావికులకు శిక్షణ ఇవ్వడంలో సహకరించుకుంటాం. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో మా సహకారానికి కొత్త బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారత యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. నౌకా నిర్మాణంలో సహకారం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయగలదు. ఇది ఉపాధి, నైపుణ్యాలు, ప్రాంతీయ అనుసంధానం పెంచుతుంది. పౌర అణుశక్తి రంగంలో దశాబ్దాల నాటి సహకారం క్లీన్ ఎనర్జీ ఉమ్మడి ప్రాధాన్యతలో ముఖ్యమైనది. మేం ఈ సహకారాన్ని కొనసాగిస్తాం. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను నిర్ధరించడంలో కీలకమైన ఖనిజాలలో సహకారం చాలా ముఖ్యమైనది. ఇది క్లీన్ ఎనర్జీ, హైటెక్ మ్యానుఫాక్చరింగ్, నూతన పరిశ్రమలలో మా భాగస్వామ్యాలకు దృఢమైన మద్దతును అందిస్తుంది. ఇటీవల, రష్యాలో భారతదేశానికి చెందిన రెండు కొత్త కాన్సులేట్లు ప్రారంభించారు. ఇది రెండు దేశాల పౌరుల మధ్య సంబంధాలు, సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో కల్మికియాలోని అంతర్జాతీయ బౌద్ధ వేదికలో లక్షలాది మంది భక్తులు బుద్ధుని పవిత్ర అవశేషాల ఆశీర్వాదాలను పొందారు. వృత్తి విద్య, నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై కూడా మేం కలిసి పని చేస్తాం. రెండు దేశాల నుంచి విద్యార్థులు, పండితులు, క్రీడా సంబంధిత వ్యక్తుల మార్పిడిని కూడా పెంచుతాం. అని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

