Kavach System : రైలు ప్రమాదాలకు ఇక చెక్.. స్వదేశీ టెక్నాలజీతో దూసుకుపోతున్న క్వాడ్రెంట్.

Kavach System : భారతీయ రైల్వే అంటే కేవలం కొత్త పట్టాలు వేయడం, రైళ్లు నడపడమే కాదు.. ప్రయాణికుల భద్రతను లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో రైల్వే నెట్‌వర్క్ ఆధునీకరణలో క్వాడ్రెంట్ ఫ్యూచర్ టెక్ అనే కంపెనీ ఒక సంచలనంగా మారుతోంది. గతంలో కేవలం రైల్వే, రక్షణ రంగాలకు కేబుల్స్ సరఫరా చేసే ఈ సంస్థ, ఇప్పుడు రైళ్లను ప్రమాదాల నుంచి రక్షించే అత్యాధునిక సిగ్నలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతానికి ఈ కంపెనీ ఆదాయం ప్రధానంగా కేబుల్ వ్యాపారం నుంచే వస్తోంది. డిసెంబర్ 2025 నాటికి ఈ సంస్థ సుమారు రూ.96 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఇది రూ.125 నుంచి 140 కోట్ల వరకు చేరుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కేబుల్స్ కంటే కూడా ఈ కంపెనీ తయారు చేస్తున్న కొత్త సాఫ్ట్‌వేర్ ఆధారిత భద్రతా వ్యవస్థలే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రైల్వే ప్రమాదాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కవచ్ సిస్టమ్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు లేదా పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసి ప్రమాదాన్ని తప్పించే సాంకేతికత ఇది. క్వాడ్రెంట్ సంస్థ ఈ కవచ్ సిస్టమ్ కోసం సొంతంగా స్వదేశీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేసింది. ఇది కంపెనీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతోంది.
ఈ కంపెనీకి ఉన్న డిమాండ్‌ను దాని ఆర్డర్ బుక్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.919 కోట్ల భారీ ఆర్డర్లు ఉన్నాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వంటి దిగ్గజ ప్రభుత్వ సంస్థలు ఈ కంపెనీకి కీలక ప్రాజెక్టులను అప్పగించాయి. అయితే, కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం, నిపుణులైన ఇంజనీర్ల నియామకం కోసం కంపెనీ భారీగా ఖర్చు చేస్తోంది. దీనివల్ల ప్రస్తుతానికి కొంత నష్టం కనిపిస్తున్నా, 2027 నుంచి అసలైన లాభాల పంట పండుతుందని నిపుణులు చెబుతున్నారు. 2025లో ఐపీవో ద్వారా రూ.290 కోట్లు సేకరించిన ఈ కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ.291 వద్ద ఉంది. భవిష్యత్తులో ఈ షేరు రాకెట్‌లా దూసుకెళ్లే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
