Rahul Gandhi: షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi: షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్
మహిళలను అవమానించడం నీచం అంటూ మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. మరో రెండుమూడు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో.. అన్ని పార్టీల అధిష్టానాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. అంతేకాక.. అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు తమ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. మరోవైపు, ఈసారి ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకూడా కీలకంగా మారబోతోంది. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా పర్యటిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో తనదైనశైలిలో ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని వైసీపీ(YCP) శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ఆమె ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. డైరెక్ట్ గా జగన్ కే బాణం ఎక్కుపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు తండ్రి వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల హస్తం ఉందంటూ ఆరోపిస్తున్న వైఎస్ సునీతకి షర్మిల మద్దతుగా నిలబడ్డారు. ఈ వ్యవహారం అంతా వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియా వైఎస్ షర్మిల, సునీత లపై ట్రోల్స్ మొదలుపెట్టారు. నువ్వసలు వైఎస్సార్ కూతురివేనా అంటూ షర్మిలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

మహిళలను అవమానించడం, వారిపై మాటల దాడి చేయడం నీచమైన పనంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పనిని కేవలం పిరికిపందలు చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియా వేదికగా దాడులు జరగడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఆదివారం ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు.

మహిళలను కించపరచడం పిరికిపందల చర్య అని, దురదృష్టవశాత్తూ బలహీనులపై బలవంతులు ఉపయోగించే మొదటి ఆయుధం ఇదేనని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story