Rains: ఉత్తరాదిని వణికిస్తోన్న వర్షాలు..పలు జిల్లాల్లో రెడ్‌అలర్ట్
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లు కురుస్తున్న వానలతో పలు రాష్ట్రాలు నీటమునిగాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యాన , జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, యూపీలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. మరో రెండ్రోజులు కుండపోత వానలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. హిమాచల్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 17 మంది చనిపోయారు.బియాస్ నది ఉగ్రరూపం దాల్చింది.వరద ఉధృతి, కొండచరియలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. బడ్డీ, కుల్లూ, ఉనా ప్రాంతాల్లో బ్రిడ్జిలు విరిగిపోయాయి. లార్జి పవర్ ప్రాజెక్టు మునిగిపోయింది. కులులో లారీలు, భారీ రాళ్లు, పెద్దపెద్ద దుంగలు వరదలో కొట్టుకుపోయాయి. మనాలీలో భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వందేళ్ల నాటి ఓ వంతెన నేలమట్టమైంది. 10 జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేశారు. శిమ్లా-కల్కా మార్గంలో రైళ్లు, వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. పర్యాటక ప్రదేశమైన మనాలీలో చిక్కుకుపోయిన 29 మందిని ఎన్టీఆర్‌ఎఫ్, పోలీసులు కాపాడారు.సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దింపారు.
ఢిల్లీలో యుమునా నది పరవళ్లు తొక్కుతోంది. హర్యానాలోని హథినీకుండ్ బ్యారేజీ నుంచి మరింత నీటిని విడుదల చేయడంతో యుమున 204 మీటర్ల మార్కు దాటింది. ఇవాళ ప్రమాదకర స్థాయిగా పరిగణించే 205 మీటర్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వర్షం తెరిపిచ్చినా... అనేక ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు వర్షపు నీరు నిలిచిపోయి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఎగువ రాష్ట్రాల నుంచి నీళ్లను విడిచిపెడుతుండడంతో ఢిల్లీలో యమునానది ప్రమాద స్థాయి ని మించి పరవళ్లు తొక్కుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ముప్పు లేదన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో రోడ్లు నీటి కొలనులను తలపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్ యాత్ర కోసం వెళ్లిన వేలాది మంది భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి రాంబన్ వద్ద తీవ్రంగా దెబ్బతింది. దీంతో జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూలో 6 వేల మందికి పైగా యాత్రికులు ఆగిపోయారు. భగవతి బేస్ క్యాంప్ దగ్గరే 5 వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్‌లో జల దిగ్బంధంలో చిక్కుకున్న ఓ యూనివర్సిటీ నుంచి 1000 మంది విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలించింది.
జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో వానల ధాటికి 450 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. లద్దాఖ్‌లో 24 గంటల రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు. పంజాబ్‌లో కొన్నిచోట్ల వరదలు సంభవించాయి. పటియాలా జిల్లాలో వరదల బీభత్సం దృష్ట్యా సైన్యాన్ని రంగంలో దించారు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లోనూ 14 జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. మౌంట్ అబూలో 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 231 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లో జలాశయాలన్నీ నిండిపోతున్నాయి.
రాజస్థాన్‌లో కుంభవృష్టితో జన జీవనం స్తంభించింది. సిరోహీ జిల్లాలోని మౌంట్ అబూలో 23.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని జైపూర్‌లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గుజరాత్‌లో రెండో రోజు సోమవారం కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 8 గంటల వ్యవధిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా 37 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించారు. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో సహాయ చర్యల కోసం 39 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలో దింపారు. వీరితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సేవలందిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com