Rajasthan : ఏసీ కొనాలంటే 50 మొక్కలు నాటాలి.. రాజస్థాన్ సర్కార్ కొత్త డ్రైవ్
ఆగస్ట్ 7న హరియాలి తీజ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజల్ని పెద్దసంఖ్యలో భాగస్వాములను చేసేందుకు వినూత్న కార్యక్రమాలు సిద్ధం చేసింది. ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారు కనీసం 50 మొక్కలు నాటాలనే నిబంధన విధించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది వేసవిలో కొన్ని నగరాలు, పట్టణాలు ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేశాయని గుర్తుచేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను నిరోధించి ప్రజల ప్రాణాలను, పచ్చదనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరియాలి తీజ్ సందర్భంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ను చేపట్టిందని మంత్రి తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా బైక్, కారు, ట్రక్ డ్రైవర్లు వరుసగా కనీసం ఐదు, పది, ఇరవై మొక్కలు నాటాలని చెప్పారు.
అదే సమయంలో పెట్రోల్ పంపు, గ్యాస్ ఏజెన్సీ యజమానులను 300 మొక్కలు నాటాలని కోరామని చెప్పారు. ఇక ఫ్యాక్టరీలు తమ ఉద్యోగుల సంఖ్యకు సమానమైన మొక్కలు నాటాలని నిబంధన విధించామని తెలిపారు. ఈ డ్రైవ్ బలవంతంగా చేపట్టలేమని, ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొని మొక్కలు నాటాలని కోరుతున్నామని మంత్రి వివరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com