RBI : అప్పు ఎగ్గొట్టిన వారికే మళ్ళీ అప్పా? ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ సీరియస్ వార్నింగ్.

RBI : బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) అనుసరిస్తున్న కొన్ని రుణ పద్ధతులపై ఆర్‌బీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించని కస్టమర్లకు మళ్లీ కొత్తగా లోన్లు ఎందుకు ఇస్తున్నారంటూ కనీసం మూడు ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ ప్రశ్నించింది. వార్షిక తనిఖీల్లో భాగంగా వెలుగుచూసిన ఈ లోన్ మాయాజాలం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఇక్కడ జరుగుతున్న అసలు కథ ఎవర్‌గ్రీనింగ్. అంటే ఏమిటంటే.. ఒక కస్టమర్ పాత అప్పు కట్టలేక ఇబ్బంది పడుతుంటే, అతనికి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చి, ఆ డబ్బుతో పాత అప్పును తీయించడం. ఇలా చేయడం వల్ల కంపెనీ రికార్డుల్లో ఆ లోన్ వసూలు కాని బాకీ కింద పడదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్లీన్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ, లోపల మాత్రం అప్పుల కుప్ప పెరిగిపోతూనే ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వెహికల్ లోన్ కట్టకపోతే, అతనికి హోమ్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్ ఇచ్చి పాత బాకీని సర్దుబాటు చేస్తున్నట్లు ఆర్‌బీఐ అధికారులు గుర్తించారు.
సాధారణంగా ఏదైనా లోన్ కిస్తీ 90 రోజుల పాటు రాకపోతే దానిని ఎన్‌పీఏగా గుర్తిస్తారు. అంతకంటే ముందే, అంటే ఒక్క రోజు ఆలస్యమైనా దానిని SMA-0గా, 31-60 రోజుల ఆలస్యాన్ని SMA-1గా, 61-90 రోజుల ఆలస్యాన్ని SMA-2గా పిలుస్తారు. కానీ ఎన్‌బీఎఫ్‌సీలు ఈ దశల వరకు వెళ్లకుండానే కొత్త లోన్లతో కప్పిపుచ్చుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమని ఆర్‌బీఐ హెచ్చరించింది. కొత్త అప్పు ఇవ్వడం అనేది కంపెనీ నిర్ణయం కావొచ్చు, కానీ దానికి సంబంధించి బోర్డు ఆమోదించిన స్పష్టమైన పాలసీ ఉండాలని, ఎవర్‌గ్రీనింగ్‌కు తావు ఉండకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
ముఖ్యంగా రూ.250 కోట్ల కంటే ఎక్కువ నెట్ వర్త్ ఉండి, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్(IndAS) పాటించే కంపెనీల విషయంలో ఆర్‌బీఐ మరింత కఠినంగా ఉంది. IndAS నిబంధనల ప్రకారం.. ముప్పును ముందే పసిగట్టి దానికి తగిన నిధులను పక్కన పెట్టాలి. దీనినే ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ECL) మోడల్ అంటారు. అంటే లోన్ మొండిబకాయిగా మారే వరకు వేచి చూడకుండా, రిస్క్ పెరిగినప్పుడే జాగ్రత్త పడాలన్నమాట. ఎన్‌బీఎఫ్‌సీలు తమ రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుచుకోవాలని, పారదర్శకత పాటించాలని ఆర్‌బీఐ ఉద్దేశం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
