RBI : లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్..ఆర్‌బీఐ సంచలన నిబంధనలు.

RBI : బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? వాయిదాలు చెల్లించడం ఆలస్యమైతే రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారా? ఫోన్లలో బెదిరిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. లోన్ రికవరీ పేరుతో సాగుతున్న గూండాయిజానికి చెక్ పెట్టేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ నడుం బిగించింది. రికవరీ ఏజెంట్లు ఎలా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఫోన్ చేయాలో వివరిస్తూ అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల ఆత్మహత్యలు, మానసిక వేదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ సెకండ్ అమైండ్‌మెంట్ డైరెక్షన్స్, 2026 ముసాయిదాను తెచ్చింది. దీని ప్రకారం ప్రతి బ్యాంకు కచ్చితంగా ఒక రికవరీ పాలసీని రూపొందించాలి. ఈ పాలసీని వెబ్‌సైట్, యాప్‌లలో స్పష్టంగా ఉంచాలి. లోన్ తీసుకున్న వ్యక్తి వాయిదా కట్టలేకపోతుంటే, ముందుగా అతనికి పరిస్థితిని వివరించి పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత బ్యాంకుదే. అంతేకాకుండా బ్యాంకు తరపున పనిచేసే గుర్తింపు పొందిన ఏజెంట్ల జాబితాను పబ్లిక్ చేయాలి. ఎవరైనా కస్టమర్ బ్యాంకులో ఫిర్యాదు చేస్తే, ఆ సమస్య తేలే వరకు రికవరీ ప్రక్రియను నిలిపివేయాల్సి ఉంటుంది.
ఏజెంట్లకి కఠిన నిబంధనలు
రికవరీ ఏజెంట్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి వీల్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కేవలం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్లను సంప్రదించాలి. లోన్ తీసుకున్న వ్యక్తిని సామాజికంగా కించపరచకూడదు. అతని స్నేహితులు, బంధువులు లేదా సహోద్యోగులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు. కస్టమర్ ఇంట్లో పెళ్లి, చావు లేదా పండుగలు ఉన్నప్పుడు వారిని సంప్రదించడం పూర్తిగా నిషిద్ధం. కస్టమర్లతో జరిపే ప్రతి సంభాషణను రికార్డ్ చేయాలి. ఆ విషయాన్ని కస్టమర్‌కు ముందే చెప్పాలి. ప్రతి చెల్లింపు తర్వాత రసీదు ఇవ్వడం తప్పనిసరి.
ఏది అస్సలు సహించదు?
రికవరీ పేరుతో బూతులు తిట్టడం, శారీరక దాడికి పాల్పడటం, సోషల్ మీడియాలో కస్టమర్ ఫోటోలు పెట్టి పరువు తీయడం వంటి చర్యలను ఆర్‌బీఐ గూండాయిజం కింద పరిగణిస్తుంది. అబద్ధపు న్యాయపరమైన హెచ్చరికలు పంపడం కూడా నేరమే. ఈ నిబంధనలు ఉల్లంఘించే బ్యాంకులు మరియు ఏజెంట్లపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా, వారి లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.
మానవత్వంతో కూడిన బ్యాంకింగ్
బ్యాంకులు తమ డబ్బును తాము వసూలు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది చట్టం, మానవత్వ పరిధిలో ఉండాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తే సామాన్యులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. రికవరీ ఏజెంట్ గడప దాటి లోపలికి రావాలన్నా, ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఇకపై భయపడాల్సిందే. ఈ రూల్స్ పై మీ అభిప్రాయాలను ఆర్‌బీఐకి సూచనల రూపంలో పంపవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
