ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ పై జీఎస్టీ తగ్గించాలి : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ తరహా వాహనాలపై జీఎస్టీని 12 శాతానికి పరిమితం చేయాలన్నారు. జీఎస్టీ తగ్గించడంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల పాత్ర కీలకమన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బయో ఎనర్జీ అండ్ టెక్ ఎక్స్‌పోలో ఆయన మాట్లాడారు. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి.. బయో ఫ్యూయల్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.ఒకటి కంటే ఎక్కువ ఇంధన రకాలతో నడిస్తే వాటిని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ గా పిలుస్తారు. సాధారణంగా పెట్రోల్ ప్లస్ ఇథనాల్, మిథనాల్‌తో వంటి ఇంధనాలతో వీటిని నడపొచ్చు. అయితే, ఈ తరహా వాహనాలపై జీఎస్టీ తగ్గించాలంటే రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాయం ముఖ్యమని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇదే విషయమై గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరినట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్‌తోనూ ఇదే విషయమై మాట్లాడానని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురించి చర్చించాలని సూచించినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఏటా మన దేశం రూ.22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్(శిలాజ ఇంధనం)ను దిగుమతి చేసుకుంటోందని గడ్కరీ అన్నారు. ఈ ఇంధన వాడకం అనేది పర్యావరణంపైనే కాకుండా ప్రభుత్వ ఖజానాపైనా భారం పడుతోందన్నారు. అందుకే ఫాసిల్ ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించి.. బయో ఫ్యూయల్ ను ప్రోత్సహించాలన్నారు. దీని వల్ల వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com