Parlament: ప్రత్యేక సమావేశాలపై అజెండా విడుదల

Parlament:  ప్రత్యేక సమావేశాలపై అజెండా విడుదల
సభ ముందుకు ఎన్నికల కమిషనర్ల నియామకంతోపాటు నాలుగు కీలక బిల్లులు

ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా బయటికొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాజ్యసభ,లోక్‌సభ సచివాలయాలు బుధవారం రాత్రి బులిటెన్‌ రూపంలో విడుదల చేశాయి. ఈ నెల 19నకొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18వ తేదీన 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి ఇప్పటి వరకూ సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాల గురించి ఇందులో చర్చిస్తారు.


18న పాత పార్లమెంట్‌ భవనంలోనే సమావేశాలు మొదలై, 19న వినాయక చవితిని పురస్కరించుకొని నూతన పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు కొనసాగే అవకాశముంది. తర్వాత 5 బిల్లులను , ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్‌ సవరణ బిల్లు-2023, ద ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023.. లోక్‌సభ ముందుకు రానున్నాయి. రాజ్యసభలో ఆగస్టు 10న ప్రవేశపెట్టిన పోస్టాఫీసుల బిల్లు 2023, ది ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర కమిషనర్ల అపాయింట్‌మెంట్, కండీషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌ బిల్లు 2023, జులై 27న లోక్‌సభ ఆమోదించిన వివిధ నిరర్ధక చట్టాల రద్దుకు సంబంధించిన ‘ది రిపీలింగ్‌ అండ్‌ అమెండింగ్‌బిల్లు-2023 రానున్నాయి.పోస్టాఫీసు, ఎన్నికల కమిషనర్‌ బిల్లులురాజ్యసభలో పాసైన వెంటనే లోక్‌సభలో ప్రవేశపెట్టి పాస్‌ చేయనున్నారు. గత నెల 31న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల తేదీలను ప్రకటించారు.


ఎజెండా తర్వాత ప్రకటిస్తామని చెప్పడంతో దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణలాంటి అంశాలను ప్రభుత్వం సభ ముందుకు తేవొచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రకటించిన అధికారిక ఎజెండాలో అవేవీ కనిపించ లేదు. కీలకమైన బిల్లుల గురించి కేంద్రం ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ అంశాల ప్రస్తావన ఎజెండాలో తీసుకురాలేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రహస్య ఎజెండాలో భాగంగానే సాధారణ బిల్లులను ఈ ఎజెండాలో చేర్చిందని చెబుతున్నారు.అయితే అకస్మాత్తుగా సంచలన అంశాలను సభ ముందుకు తేవడం మోదీ ప్రభుత్వానికి అలవాటని,ఆర్టికల్‌ 370 రద్దు బిల్లును అలాగే తెచ్చారని ఈ సమావేశాల్లోనూ ఎవరూ ఊహించని అంశాన్ని సభ ముందుకు తీసుకురావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story