Money Laundering Case : మనీ లాండరింగ్ కేసులో లాలూ, తేజస్వి యాదవ్ కు ఊరట

మనీ లాండరింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఊరట లభించింది. జాబ్ ఫర్ మనీ కేసులో లాలు, ఆయన కుమారులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున బెయిల్ బాండ్ ఇవ్వాలని, నిందితులందరూ తమ పాస్‌పోర్టులను అప్పగించాలని, ఎవరూ దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అలాగే పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసిన తర్వాత బెయిల్ బాండ్ చెల్లించడానికి లాలూ యాదవ్, తేజస్వి, తేజ్ ప్రతాప్ వచ్చారు. అనంతరం తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. తమపై కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. తమను ఇరికించేందుకు కేంద్ర సంస్థలను దుర్వినియోగపరుస్తుందని ఆరోపించారు. కాగా ఈ కేసు లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అభ్యర్థుల నుంచి భూములు తీసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి. రైల్వే మంత్రిగా ఉంటూనే లాలూ, ఆయన సన్నిహితులు కొందరు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఒప్పందాలు కుదుర్చుకున్నారని. రైల్వేలో ఉద్యోగాలు పొందాలనుకునే వందలాది మంది వారి భూమిని లాలూ యాదవ్ కుటుంబం, ఆయన సమీప బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి. దీంతో అప్పటి నుంచి లాలూ కుటుంభం ఈ కేసును ఎదుర్కొంటూనే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com