Muda Scam : ముడా స్కాంలో సిద్ధరామయ్యకు ఊరట
ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఈ స్కాంకు సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడానికి సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టులో సీఎం తరఫు న్యాయవాదులు వాదించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్‌ను ఆమోదించారని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందన్నారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com