Jaipur Road Accident : జైపూర్ లో రోడ్డు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రాజస్థాన్లోని జైపూర్ లో శుక్రవారం జరిగిన భారీ రోడ్డుప్రమాదంలో 12మంది దుర్మరణంపాలైనారు. జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఎల్పీజీ ట్రక్, మరికొన్ని వాహనాలను ఢీకొనడంతో గ్యాస్ లీకైంది. వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జైపూర్ లోని భ్రంకోటా ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పెట్రోల్ బంక్ వద్ద ఉన్న వాహనాలూ దగ్ధమైనాయి. పెట్రోల్ బంక్లోనూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12మంది ప్రాణాలు కోల్పోగా 41 మందికి తీవ్ర గాయాలైనాయి. వారిలో చాలామంది పరిస్థితివిషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వివిధ వాహనాల్లో వెడుతున్నవారు భయాందోళనలకు గురైనారు. వాహనాల్లోంచి దిగి దూరంగా పారిపోయే ప్రయత్నం చేయగా దుస్తులకు మంటలు అంటుకోవడంతో తీవ్రగాయాలపాలైనారు. అక్కడున్న అనేక వాహ నాలూ మంటల్లో దగ్ధమైనాయి. మంటలను అదుపుచేసేందుకు 20 అగ్నిమాపక వాహనాలు పనిచేస్తూండగా 25 అంబులెన్సుల్లో బాధితులను నగరంలోని జైపూర్ సవాస్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 40 వాహనాలు దగ్ధమైనాయని జిల్లా మెజిస్ట్రేట్ జితేంద్ర సోని తెలిపారు. కాగా ఈ సంఘటనపై విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com