Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో సోమవారం రాత్రి కారు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్లుపూర్ గ్రామ సమీపంలోని కళ్యాణి నదిపై ఉన్న వంతెనపై రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులందరూ కారులోని ప్రయాణికులు. ఫతేపూర్ పట్టణం నివాసితులుగా గుర్తించారు.
కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. దానిని రోడ్డుపై నుండి తొలగించడానికి క్రెయిన్ ను ఉపయోగించాల్సి వచ్చింది. అయితే, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు.. ఆ తరువాత జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. ఇద్దరు ఆస్పత్రిలో మరణించినట్లు అధికారులు చెప్పారు.
బారాబంకి జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి పోలీస్ సూపరింటెండెంట్ అర్పిత్ విజయవర్గియాతో కలిసి ప్రమాద స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామని చెప్పారు. కారు రాంగ్ రూట్ లో రావడం వల్ల వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టిందని తెలిపారు.
ఎస్పీ విజయవర్గియ మాట్లాడుతూ.. కారులో ప్రమాద సమయంలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వారు వేరే ప్రాంతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకొని ఫతేపూర్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని, ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

