Kejriwal : కేజ్రీవాల్ విడుదల వెనుక బీజేపీ .. రాబర్ట్ వాద్రా సంచలన ఆరోపణలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి విడుదల కావడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలన్న లక్ష్యమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో జైలుకు వెళ్లారు. ఆ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికల వేళ ఆయన 20 రోజుల పేరోల్‌కు దరఖాస్తు చేసుకోగా అనుమతి లభించడం చర్చనీయాంశమైంది. పలు కేసుల్లో నిందితుడైన ఆయనకు రాష్ట్రంలో భారీ అనుచరగణం ఉంది. అందుకే ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బాబాకు పేరోల్ ఇచ్చారని వాద్రా విమర్శించారు. డేరాబాబాతోపాటు కేజ్రీవాల్ కూడా ఎన్నికల ప్రచారం సమయంలోనే తీహార్ జైలు నుంచి బయటకు రావడం లాంటి పరిణామాలు వెనుక బీజేపీ హస్తం ఉన్నదనేది తన అభిప్రాయమని రాబర్ట్ వాద్రా తెలిపారు. వీరిద్దరూ కాంగ్రెస్ విజయావకాశాలకు గండి కొట్టగలరని బీజేపీ అనుకుంటోందని ఆయన చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com