Bihar CM : జర్నలిస్టులకు రూ.15వేల పింఛను .. సీఎం నితీష్ కుమార్ మరో కీలక నిర్ణయం

బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. అర్హులైన జర్నలిస్టులకు నెలవారీ పింఛనును గతంలో ఇస్తున్న రూ. 6,000 నుండి రూ. 15,000కు పెంచారు. ఇది దాదాపు 9,000 రూపాయల పెంపు. ఆగస్టు 1, 2025 నుండి ఈ పెరిగిన పింఛను మొత్తం చెల్లించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. 'బిహార్ పత్రకార్ సమ్మాన్ పింఛన్ పథకం' కింద పింఛను పొందుతున్న జర్నలిస్టులు మరణించినట్లయితే, వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామికి జీవితాంతం చెల్లిస్తున్న రూ. 3,000 పింఛనును రూ. 10,000కు పెంచారు. ఈ నిర్ణయం శనివారం నితీష్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారు నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వర్తించడానికి మరియు పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పెంపుదల రానున్న ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com