Putin India Visit: ఆహారం, నీరు, బాత్‌రూమ్‌ అన్నీ మాస్కో నుంచే

Putin India Visit: ఆహారం, నీరు, బాత్‌రూమ్‌ అన్నీ మాస్కో  నుంచే
X
విదేశీ పర్యటనల్లో పుతిన్‌ భద్రత ఇలా

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ను సందర్శించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుతిన్‌ భారత్‌లో తినే ప్రతి ఆహార పదార్థాన్ని రష్యా నుంచి తెచ్చిన ల్యాబొరేటరీలో పరీక్షించనున్నారు. అంతేగాక ఆయన పర్యటనలో ప్రత్యేక చెఫ్‌లు కూడా ఉంటారు. వారు రష్యా నుంచి తెచ్చిన వంట దినుసులతోనే పుతిన్‌కు ఆహారం తయారవుతుంది. ల్యాబ్‌ సిబ్బంది పరీక్షించిన తర్వాతే ఆయనకు భోజనం అందచేస్తారు. పుతిన్‌ ప్రయాణించే ప్రత్యేక ఓరస్‌ సెనట్‌ కారు సైతం ఆయన సందర్శనకు ముందే విమానం ద్వారా భారత్‌కు రవాణా కానున్నది.

ఈ పర్యటనలో మరో విచిత్రమైన విషయం ఏమిటంటే భారత్‌లో పుతిన్‌ విసర్జించే మలమూత్రాలను ఆయన భద్రతా సిబ్బంది ఓ సంచీలో భద్రపరిచి మాస్కోకు తీసుకువెళ్లిపోతారు. అంతేగాక పుతిన్‌ ఉపయోగించే టాయ్‌లెట్‌, టెలిఫోన్‌ బూత్‌ కూడా మాస్కో నుంచే రానున్నాయి. పుతిన్‌ భద్రతా బాధ్యతలను ప్రెసిడెన్షియల్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎస్‌బీపీ) చూసుకుంటుంది. తమ అధ్యక్షుడి పర్యటనకు ముందుగానే ఆతిథ్య దేశంలోని క్రైమ్‌ రేటు, ఉగ్రవాదం, నిరసనలు, మతపరమైన కార్యకలాపాల గురించి ఎస్‌బీపీ ఆరాతీస్తుంది. పుతిన్‌ బసచేసే హోటల్‌ను కనీసం నెలరోజుల ముందుగానే ఆయన భద్రతా బృందం తనిఖీ చేస్తుంది. ఈ బృందంలో రష్యాకు చెందిన ప్రధాన భద్రతా సంస్థ ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌(ఎఫ్‌ఎస్‌బీ), ఫారిన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌(ఎస్‌వీఆర్‌) సభ్యులు కూడా ఉంటారు.

అధ్యక్షుడి ఆగమనానికి ముందు హోటల్‌ రూములోని అన్ని ఆహార పదార్థాలు, పానీయాలు, సోపు, షాంపూ, హ్యాండ్‌వాష్‌, టూత్‌పేస్టు వంటి వ్యక్తిగత వస్తువులను తొలగించి వాటి స్థానంలో రష్యా నుంచి తెచ్చిన వస్తువులను ఉంచుతారు. పుతిన్‌ మొబైల్‌ ఫోన్లను ఉపయోగించరు. పూర్తి సురక్షితమైన కమ్యూనికేషన్‌ లైనును ఆయన ఉపయోగిస్తారు. ఇందుకోసం అధ్యక్షుడి రూములోనే ఓ టెలిఫోన్‌ బూత్‌ను ఆయన బృందం ఏర్పాటు చేస్తుంది. టాయ్‌లెట్‌నే కాదు హోటల్‌ బాత్‌రూమును కూడా పుతిన్‌ వాడరు.

ఆయన కోసం రష్యా నుంచి మొబైల్‌ బాత్‌రూము వస్తుంది. దీన్ని కూడా ఆయన గదిలోనే ఏర్పాటు చేస్తారు. పుతిన్‌ తిరుగు ప్రయాణం కోసం ఓ విమానం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పుతిన్‌తో కనీసం 100 మంది ప్రయాణిస్తారు. వీరిలో వ్యక్తిగత అంగరక్షకులు, ఎస్‌బీపీ, ఫెడరల్‌ ప్రొటెక్టివ్‌ సర్వీస్‌ బృందాలు, ప్రొటొకాల్‌ ఆఫీసర్లు, పరిపాలనా సిబ్బంది, మీడియా సభ్యులు ఉంటారు. పుతిన్‌తో ప్రయాణించడానికి ముందు ఆయన బాడీగార్డులు రెండువారాల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

అధ్యక్షుడి విమాన ప్రత్యేకతలు

పుతిన్‌ ప్రయాణించే విమానానికి రక్షణగా ఒకటి లేదా 2 విమానాలు వెన్నంటి ఉంటాయి. అధ్యక్షుడు ప్రయాణించే విమానం అత్యంత అధునాతనంగా ఉంటుంది. అత్యంత అధునాతన కమ్యూనికేషన్‌ వ్యవస్థ అందులో ఉంటుంది. క్షిపణి దాడులను తట్టుకునే రక్షణ వ్యవస్థ ఈ విమానం ప్రత్యేకత. అంతేగాక ఈ విమానంలో అణ్వస్త్ర కమాండ్‌ కంట్రోల్‌ బటన్‌ కూడా ఉంటుంది. గగనంలోనుంచే అధ్యక్షుడు అణ్వస్ర్తాల ప్రయోగానికి ఆదేశించవచ్చు. విమానంలో అనేక సమావేశ గదులు, కాన్ఫరెన్స్‌ రూము, బెడ్‌రూము, బార్‌, జిమ్‌, మెడికల్‌ రూము ఉంటాయి. విమానం లోపలి భాగం బంగారు తాపడం కలిగి ఉంటుంది. ఏకకాలంలో 262 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఏకబిగిన 11,000 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు.

Tags

Next Story