Post Office : బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ.. అదిరిపోయే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్.

Post Office : నేటి కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక అనిశ్చితి మధ్య సామాన్య ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఒక సురక్షితమైన మార్గాన్నే వెతుకుతుంటారు. పెట్టిన పెట్టుబడికి భరోసా ఉండటంతో పాటు, బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన లాభం రావాలని కోరుకుంటారు. అచ్చం అలాంటి వారి కోసమే పోస్టాఫీసు అదిరిపోయే పొదుపు పథకాలను అందిస్తోంది. భారత ప్రభుత్వ గ్యారెంటీతో నడిచే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ఇప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్ గా మారింది. కేవలం రూ.2 లక్షల పెట్టుబడితో సుమారు రూ.90 వేల దాకా వడ్డీని సంపాదించే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది బ్యాంకుల్లో మనం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే. కానీ ఇందులో వడ్డీ రేట్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీ డబ్బు నేరుగా ప్రభుత్వం వద్ద ఉంటుంది కాబట్టి నయా పైసా రిస్క్ ఉండదు. మీ అవసరాలకు తగ్గట్టుగా ఒకటి, రెండు, మూడు లేదా ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకంలో డబ్బు దాచుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రేట్ల ప్రకారం.. ఏడాది డిపాజిట్‌పై 6.9%, రెండు లేదా మూడేళ్ల డిపాజిట్లపై 7% వడ్డీ లభిస్తోంది. అయితే, ఐదేళ్ల పాటు పెట్టుబడి పెడితే మాత్రం ఏకంగా 7.5 శాతం అత్యధిక వడ్డీని పొందవచ్చు.
రూ.2 లక్షల పెట్టుబడితో రూ.90 వేల లాభం ఎలా?
పెట్టుబడి సూత్రం ఒక్కటే.. ఎంత ఎక్కువ కాలం ఉంచితే అంత ఎక్కువ లాభం. మీరు రూ.2 లక్షలను ఐదేళ్ల కాలపరిమితితో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్ల తర్వాత మీ చేతికి రూ.2,89,990 అందుతాయి. అంటే మీరు పెట్టిన రూ.2 లక్షలు కాకుండా, కేవలం వడ్డీ రూపంలోనే రూ.89,990 సంపాదించవచ్చన్నమాట. షేర్ మార్కెట్ టెన్షన్లు లేకుండా, రూపాయి నష్టం రాకుండా ఇంత భారీ లాభం రావడం సామాన్యులకు ఒక గొప్ప వరం.
రూ.5 లక్షల పెట్టుబడిపై బంపర్ రిటర్న్స్
మీ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే లాభం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఉదాహరణకు, మీరు రూ.5 లక్షలను ఐదేళ్ల పాటు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.2,24,974 కేవలం వడ్డీ రూపంలోనే వస్తాయి. మొత్తంగా మీ చేతికి రూ.7,24,974 అందుతాయి. లాభంతో పాటు ఈ పథకంలో మరో పెద్ద వెసులుబాటు ఉంది.. అదే టాక్స్ బెనిఫిట్. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఈ పథకంలో ఖాతా తెరవడం చాలా సులభం. కనీసం రూ.1,000 తో కూడా మీరు పొదుపు మొదలుపెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఒంటరిగా గానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ గా గానీ దీన్ని నిర్వహించవచ్చు. ప్రతి ఏడాది వడ్డీ మీ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
