SBI ATM : SBI కస్టమర్లకు షాక్..ఏటీఎం నగదు విత్‌డ్రా ఛార్జీలు పెంపు..కొత్త రూల్స్ ఇవే.

SBI ATM : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సర్వీస్ ఛార్జీల జాబితాను సవరించింది. దీనివల్ల ముఖ్యంగా వేరే బ్యాంక్ ఏటీఎంలను వాడే కస్టమర్లపై భారం పడనుంది. బ్యాంకులు ఒకదానికొకటి చెల్లించుకునే ఇంటర్చేంజ్ ఫీజు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఎస్‌బీఐ వెల్లడించింది. ఏటీఎం మెషిన్ల నిర్వహణ ఖర్చు పెరగడంతో, ఆ భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పలేదని బ్యాంక్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల నిరంతరం నగదు అవసరాల కోసం ఏటీఎంలపై ఆధారపడే మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు తప్పవు.
ఎస్‌బీఐలో సాధారణ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి నెలవారీగా ఇచ్చే 5 ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. అయితే, ఈ 5 సార్లు దాటిన తర్వాత వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీస్తే.. గతంలో ఉన్న రూ.21 ఛార్జీని ఇప్పుడు రూ.23కి పెంచారు. దీనికి అదనంగా జీఎస్టీ కూడా వర్తిస్తుంది. కేవలం నగదు తీయడమే కాదు, బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా మినీ స్టేట్‌మెంట్ వంటి పనుల కోసం వేరే ఏటీఎం వాడితే రూ.11 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇది రూ.10గా ఉండేది.
ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉన్నవారికి ఇప్పటివరకు వేరే బ్యాంక్ ఏటీఎంలలో కూడా అపరిమితమైన ఉచిత లావాదేవీలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును బ్యాంక్ రద్దు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. సాలరీ అకౌంట్ ఉన్నవారు నెలలో కేవలం 10 సార్లు మాత్రమే ఉచితంగా ఏటీఎంలను వాడుకోగలరు. ఇందులో నగదు విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ వంటివి అన్నీ కలిపి ఉంటాయి. 10 సార్లు దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. కార్పొరేట్ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
అయితే అందరికీ ఈ ఛార్జీలు వర్తించవు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు ఉన్నవారికి పాత పద్ధతే కొనసాగుతుంది. అలాగే, ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడి ఎస్‌బీఐకి చెందిన ఏటీఎంల నుంచే నగదు తీసుకుంటే ఎటువంటి అదనపు భారం ఉండదు. కేవలం ఇతర బ్యాంక్ ఏటీఎంలను వాడేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎస్‌బీఐ ఏటీఎంలనే వాడటం లేదా ఫ్రీ లిమిట్ లోపే నగదు అవసరాలు తీర్చుకోవడం ద్వారా ఈ అనవసరపు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

