SBI Makes History : ఎస్‌బీఐ విశ్వరూపం..స్టాక్ మార్కెట్‌లో సునామీ సృష్టించిన బ్యాంకింగ్ దిగ్గజం.

SBI Makes History : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. గత కొన్ని రోజులుగా అప్రతిహతంగా దూసుకుపోతున్న ఎస్‌బీఐ షేర్లు, బుధవారం ట్రేడింగ్‌లో మరో మైలురాయిని అధిగమించాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత విలువైన నాలుగో కంపెనీగా ఎస్‌బీఐ అవతరించింది. బ్యాంక్ మార్కెట్ విలువ ఏకంగా రూ.11లక్షల కోట్లకు చేరువలో ఉండటం గమనార్హం.
భారతీయ స్టాక్ మార్కెట్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రతాపం చూపిస్తోంది. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.10,91,982.06 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో టీసీఎస్ షేర్లు 2.5 శాతం పతనం కావడంతో దాని విలువ రూ.10,52,646.38 కోట్లకు పడిపోయింది. దీంతో ఎస్‌బీఐ, టీసీఎస్‌ను దాటి నాలుగో స్థానానికి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే బ్యాంక్ విలువ రూ.1,07,629 కోట్లు పెరగడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎస్‌బీఐ షేర్లు గత మూడు రోజులుగా రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. గత వారం రూ.1,066 వద్ద ఉన్న షేర్ ధర, బుధవారం నాటికి రూ.1,183 (బిఎస్ఈలో 3.40% వృద్ధి)కి చేరుకుంది. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో రూ.1,187.70ని తాకి తన 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బ్యాంక్ ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలు అద్భుతంగా ఉండటమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణం. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ ఎన్నడూ లేని విధంగా రూ.21,028 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ఆర్జించింది.
ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే, బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ 9.04 శాతం పెరిగి రూ.45,190 కోట్లుగా నమోదైంది. రుణాల వృద్ధి 15.14 శాతంగా ఉండటం బ్యాంక్ భవిష్యత్తుపై ధీమాను పెంచింది. మెయింటెన్స్ ఖర్చులు పెరిగినప్పటికీ, బ్యాంక్ తన లాభదాయకతను కాపాడుకోగలిగింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఇప్పటికే వెనక్కి నెట్టిన ఎస్‌బీఐ, ఇప్పుడు టీసీఎస్‌ను కూడా దాటేయడంతో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
