Narendra Modi : మత వివక్ష అంతానికి సెక్యులర్ సివిల్ కోడ్: మోదీ

సెక్యులర్ సివిల్ కోడ్ అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. ‘మతతత్వ పౌరస్మృతిని తలపించే ప్రస్తుత చట్టాలు వివక్ష చూపుతున్నాయని చాలామంది అభిప్రాయం. అది నిజమే. 75 ఏళ్లుగా అవే అమలవుతున్నాయి. ఇప్పుడు లౌకిక పౌరస్మృతి వైపు వెళ్లాలి. దీంతో మత వివక్ష అంతమవుతుంది. సుప్రీంకోర్టు ఈ దిశగా ఎన్నో ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తీ దీనినే ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిపై విస్తృత చర్చ జరగాలి’ అని ఆయన అన్నారు. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలు హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో మోదీ స్పందించారు. దేశంలో అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని ఆయన గుర్తు చేశారు. తాము మహిళలను గౌరవించడమే కాకుండా వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 2014 నుంచి ప్రతీ పంద్రాగస్టు వేడుకలకు మోదీ ఒక్కో సంస్కృతి విశిష్టతను సూచించేలా తలపాగాను ధరిస్తూ వస్తున్నారు. ఈరోజు కాషాయం, పసుపు, పచ్చ వర్ణాలు కలిగిన రాజస్థానీ లెహెరియా తలపాగాను ధరించారు. రాజస్థాన్ ఎడారుల్లో గాలి కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెల ఆకారాల స్ఫూర్తిగా లెహెరియా తలపాగాల డిజైన్ ఉంటుంది. కాగా.. గత ఏడాది పసుపు, పచ్చ, ఎరుపు రంగులతో కూడిన బంధనీ ప్రింట్ తలపాగాతో ప్రధాని కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com