Seema Haider : 'హర్ గర్ తిరంగ' లో పాల్గొన్న సీమ

దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ కోడలు సీమా హైదర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ప్రేమ కోసం పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్ ఉత్తరప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంది. ప్రియుడు సచిన్ కోసం దేశం దాటిన సీమ యూపీలో 'హర్ గర్ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్‌తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి.
తన భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి చట్టవిరుద్ధంగా సరిహద్దులు దాటిన పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్ ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది . తన లాయర్ ఏపీ సింగ్‌తో కలిసి నోయిడాలోని తన నివాసంలో జరిగిన ‘‘హర్ ఘర్ తిరంగ’’ వేడుకలో పాల్గొంది. త్రివర్ణ పతాకం ఎగురవేసిన సందర్భంగా సీమా హైదర్, సచిన్ జై భారత్ మాతా, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీమా హైదర్ సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్లు మరోసారి దంపతులిద్దరూ స్పష్టం చేశారు. నిజానికి సీమకు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా(ఎమ్‌ఎన్‌ఎస్) సీమా హైదర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని ప్రకటించారు.
తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరింది సీమా హైదర్. తన ప్రియుడు సచిన్‌తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తన అత్తింట్లో నివసించడానికి అనుమతించాలని అభ్యర్థిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు.
అయితే పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరుపుతోంది. ఎందుకంటే సచిన్‌తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com