UPI : యూపీఐ ద్వారా పొరపాటున వేరే వాళ్లకు డబ్బు పంపారా? టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే మీ డబ్బులు వాపస్.

UPI : యూపీఐ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. జేబులో రూపాయి లేకపోయినా, ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. అయితే, ఈ టెక్నాలజీ ఎంత వేగంగా పని చేస్తుందో, చిన్న పొరపాటు జరిగితే అంతే వేగంగా మన డబ్బు వేరే వాళ్ల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. యూపీఐ ఐడీ తప్పుగా టైప్ చేసినా, లేదా కాంటాక్ట్ లిస్టులో పొరపాటున వేరే పేరు ఎంచుకున్నా క్షణాల్లో డబ్బు కట్ అవుతుంది. యూపీఐ అనేది ఇర్రివర్సిబుల్, అంటే ఒకసారి పంపిన డబ్బును వెనక్కి తెచ్చే అన్‌డూ బటన్ ఇందులో ఉండదు. మరి పొరపాటున వేరే వారికి డబ్బు పంపిస్తే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం.
మొదట ఇలా ప్రయత్నించండి
అధికారికంగా ఫిర్యాదులు చేసే కంటే ముందు, ఒకసారి మానవత్వంతో ఆలోచించి ప్రయత్నించడం మంచిది. మీరు పొరపాటున ఎవరికైతే డబ్బు పంపారో, వారి కాంటాక్ట్ వివరాలు ఉంటే వారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించండి. చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మర్యాదగా డబ్బును తిరిగి పంపే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవతలి వ్యక్తి స్పందించకపోయినా లేదా డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినా, అప్పుడు మీరు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి.
బ్యాంకుకు తక్షణమే సమాచారం ఇవ్వండి
పొరపాటు జరిగిందని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. మీ యూపీఐ యాప్ (PhonePe, Google Pay, Paytm) లో ఉండే Report Issue ఆప్షన్ ద్వారా ట్రాన్సాక్షన్ ఐడీతో సహా ఫిర్యాదు నమోదు చేయండి. దీనివల్ల సిస్టంలో మీ సమస్యకు సంబంధించిన ఒక రికార్డు క్రియేట్ అవుతుంది. అలాగే ఎన్‌పీసీఐ (NPCI) పోర్టల్ లేదా భీమ్ (BHIM) యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇది మీ సమస్యను బ్యాంక్ పరిధి దాటి వ్యవస్థ మొత్తానికి చేరుస్తుంది.
నోడల్ అధికారికి ఫిర్యాదు
బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన రాకపోతే, ఆ బ్యాంక్‌లోని గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజంను ఆశ్రయించండి. ప్రతి బ్యాంకుకు ఒక నోడల్ అధికారి లేదా సీనియర్ టీమ్ ఉంటుంది. మీరు పదేపదే అదే విషయం చెప్పాల్సి వచ్చినా సరే, ఈ స్టెప్ చాలా ముఖ్యం. దీనివల్ల మీరు నిబంధనల ప్రకారం అన్ని ప్రయత్నాలు చేశారని నిరూపితమవుతుంది, ఇది భవిష్యత్తులో మీ కేసు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
ఆర్బీఐ లోక్‌పాల్ సాయం
ఒకవేళ బ్యాంకు మీ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే, మీకు చివరి ఆప్షన్ గా ఆర్బీఐ లోక్‌పాల్ అందుబాటులో ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ లోక్‌పాల్ స్కీమ్ కింద మీరు ఆన్‌లైన్‌లో కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ, ఇక్కడ బ్యాంక్ ప్రమేయం లేకుండా బయటి వ్యక్తి మీ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తారు.
జాగ్రత్తే అసలైన మందు
ఎన్ని మార్గాలు ఉన్నప్పటికీ, డబ్బు వెనక్కి రావడానికి వంద శాతం గ్యారెంటీ ఉండదు. ఎదుటి వ్యక్తి డబ్బు వాడేసినా లేదా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినా బ్యాంకులు వారిని బలవంతం చేయలేవు. అప్పుడు అది కోర్టు కేసుగా మారుతుంది. అందుకే, పెద్ద మొత్తంలో డబ్బు పంపే ముందు, ఒక రూపాయి పంపి టెస్ట్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పేరును సరిచూసుకోవడం అలవాటు చేసుకోండి. ముందస్తు జాగ్రత్త పడటం వల్ల తర్వాత పడే తిప్పలను తప్పించుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
