సెంథిల్ బాలాజీ కీలక నిర్ణయం.. మంత్రి పదవికి రాజీనామా
మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సెంథిల్ బాలాజీ (Senthil Balaji) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ (DMK Party) వెల్లడించింది. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ క్రమంలో బాలజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
క్యాష్ ఫర్ జాబ్ కేసులో 2023 జూన్ 14న బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఆయన నివాసంతో పాటుగా కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ జరిపిన తరువాత అదుపులోకి తీసుకుంది. కాగా బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.
జయలలిత ప్రభుత్వ హయాంలో 2011 నుంచి 2015 వరకు బాలాజీ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పించడానికి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులపై ఎస్ దేవ సహాయం అనే వ్యక్తి చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
సెంథిల్ బాలాజీ జైల్లో ఉన్నప్పటికీ సీఎం స్టాలిన్ మాత్రం బాలాజీని తన మంత్రి వర్గంలోనే కొనసాగించారు. కానీ ఎలాంటి పోర్ట్‌ఫోలియోను కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు సూచించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com