Siddaramaiah : ముడా స్కామ్లో సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ

ముడా స్కామ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు ఈ రోజుకు తీర్పు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా.. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకమని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచీ వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోన్న ఎంతోమంది ఈ తీర్పు నేపథ్యంలో స్పందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు, ఆయన వెంటనే రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com