Shashi Tharoor: మరోసారి ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపీ పొగడ్తల వర్షం..

పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కోసం ఐదు దేశాల్లో పర్యటించి ఇటీవల తిరిగి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మోడీ శక్తి, చైతన్యంమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని తెలిపారు. కానీ, దానికి మరింత మద్దతు అవసరం అని ఓ జాతీయ న్యూస్ కథనానికి రాసిన కాలమ్‌లో వెల్లడించారు. అయితే, పాక్ దురాక్రమణపై ప్రచారం ప్రపంచ వేదికపై భారతదేశ ఐక్యతను చాటి చెప్పిందని ఆయన నొక్కి చెప్పారు. ఐక్యత శక్తి, స్పష్టమైన కమ్యూనికేషన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాయని శశిథరూర్ రాసుకొచ్చారు.
అయితే, భారతదేశం న్యాయమైన, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వెల్లడించారు. అలాగే, సాంకేతికత, వాణిజ్యం, సంప్రదాయ పద్దతులు అనే మూడు ‘T’లు భారతదేశ భవిష్యత్తు ప్రపంచ వ్యూహాన్ని నడిపించాలని పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పాకిస్తాన్‌కు ఉన్న నిరంతర సంబంధం ప్రపంచవ్యాప్త ప్రచారంలో కీలకమైన అంశం అని నొక్కిచెప్పారు. అమెరికాలో తన ప్రతినిధి బృందం చేసిన ప్రచారాన్ని గుర్తు చేసుకుంటూ.. పాకిస్తాన్ అధికారులపై శశిథరూర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com