Odisha Paradip Port : ఒడిషా పోర్టుకు 21మంది పాకిస్థానీలతో షిప్ కలకలం

ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు వచ్చిన ఓ షిప్ కలకలం రేపింది. షిప్‌లో 21 మంది పాకిస్థాన్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా ఓ నౌక పారాదీప్ పోర్టుకు చేరింది. ఎమ్‌టీ సైరెన్ II పేరుతో ఉన్న ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ కోసం ముడి చమురును తీసుకొచ్చింది. తనిఖీలు చేపట్టగా సిబ్బందిలో 21 మందిని పాకిస్థానీయులుగా గుర్తించారు.
ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి దీని గురించి సమాచారం అందడంతో వెంటనే ఒడిశా మెరైన్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోర్టులో భద్రతను మరింత పెంచినట్లు మెరైన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బబితా దుహేరి తెలిపారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఓడరేవు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోని ‘పీఎం బెర్త్’ వద్ద లంగర్ వేసి ఉంది. ఇందులో 11 వేల 350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముడి చమురు అన్‌లోడింగ్ పూర్తయ్యే వరకూ 25 మంది సిబ్బంది నౌకను వీడకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com