MUDA Scam : భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్. ముడా భూ కుంభకోణం కేసులో ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదు మేరకు సీఎంపై విచారణకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని ధ్రువీకరించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మైసూర్ అభివృద్ధి కోసం ‘ముడా’ భూమి సేకరించింది. బదులుగా 50:50 పరిహారం ప్రకటించింది. అంటే ఎకరం తీసుకుంటే అర ఎకరం అభివృద్ధి చెందిన భూమి తిరిగిస్తారు. లేదంటే ఆర్థిక ప్యాకేజీ ఎంచుకోవచ్చు. సిద్దరామయ్య భార్య పార్వతి నుంచి తీసుకున్న భూమికి 14 సైట్లు కేటాయించడం వివాదంగా మారింది. ప్రజలకు తక్కువ డబ్బు ఇచ్చారని, కొందరికి ఇవ్వలేదని, తక్కువ రేటుకు సన్నిహితులకు భూములు అమ్మేశారని అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ఇచ్చిన ఉత్తర్వుల అధికారిక కాపీ ఇంకా సీఎంకు చేరలేదు.అందిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై న్యాయ నిపుణులతో సిద్దరామయ్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com