Himachal Pradesh : హిమాచల్ లో మంచు వర్షం.. 4 రోజులు ఇదే పరిస్థితి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. మరోనాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ హిమపాతం, శీతల గాలులు కొనసాగనున్నాయి. రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్డ్ జారీచేసింది. లహౌల్-స్పితి, చంబా, కాంగ్రా, కులు, షిమ్లా, కిన్నౌర్ సహా ఆరు జిల్లాల్లో భారీ వర్షం, హిమపాతం నమోదయ్యింది. డిసెంబరు 29 నుంచి జనవరి 1 వరకు బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉనా జిల్లాతో పాలు మండి, కులు, చాంబా జిల్లాల్లో శీతల గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురిసే అవకాశం ఉందని, వాహనాల్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా నడపాలని సూచించింది. శుక్రవారం రాజధాని సిమ్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. డిసెంబరు 29 తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు, వాహనాల్లో ప్రయాణించేవారు ముఖ్యంగా హిమపాతం కురుస్తోన్న ప్రదేశాల్లో నివసించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో భారీ హిమపాతం, అతి శీతల గాలులతో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
కులులో చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. సోలంగ్ నాలా వద్ద 1000కిపైగా వాహనాలు చిక్కుకుపోవడంతో డిసెంబరు 27న రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. స్కై రిసార్టు వద్ద చిక్కుకున్న 5 వేల మందిని కాపాడినట్టు పేర్కొన్నారు. వెయ్యికిపైగా వాహనాల్లో చిక్కుకున్న పర్యటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. ఇక, ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా యూపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. మరికొొద్ది రోజుల పాటు శీతల పవనాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com