Sourav Ganguly : సస్పెన్స్‌కు తెరదించిన గంగూలీ..!

Sourav Ganguly : సస్పెన్స్‌కు తెరదించిన గంగూలీ..!
Sourav Ganguly : 30 ఏళ్లుగా క్రికెట్‌తో అనుబంధం ఉందని, ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు గంగూలీ.

Sourav Ganguly : త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు ట్వీట్ చేసిన బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరబ్‌ గంగూలీ...కొన్ని గంటల తర్వాత దానిపై క్లారిటీ ఇచ్చారు. వరల్డ్‌ వైడ్ ఎడ్యూకేషన్ యాప్‌ ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో అప్పటివరకు జరిగిన ప్రచారాలకు తెరపడింది. అంతకుముందు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు ట్వీట్ చేశారు గంగూలీ. ఇది ఎక్కువ మందికి మేలు చేసేదిగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. కొత్త ఇన్నింగ్స్‌కు మద్దతు ఇస్తారని ట్వీట్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా క్రికెట్‌తో అనుబంధం ఉందని, ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు గంగూలీ.

ఈ ట్వీట్‌తో గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. బీసీసీఐ ప్రెసిడెంట్‌ పదవికి గంగూలీ రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ఖండించారు. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికీ గంగూలీ రాజీనామా చేయట్లేదని...అదంతా తప్పుడు ప్రచారమేనని క్లారిటీ ఇచ్చారు. భారత క్రికెట్‌ ప్రయోజనాల కోసం తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

గత నెలలో బెంగాల్‌ పర్యటనకు వచ్చిన అమిత్ షాకు తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు గంగూలీ. ఈ సమావేశానికి బెంగాల్ బీజేపీ లీడర్లు స్వపన్ దాస్ గుప్తా, అమిత్ మాలవియా కూడా హాజరయ్యారు. గంగూలీ రాజకీయాల్లోకి వస్తారనడానికి ఇది మరింత బలం చేకూర్చింది. ఐతే వీటన్నింటిని కొట్టిపారేశారు గంగూలీ. బీజేపీలో చేరట్లేదని స్పష్టం చేశారు. అటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపైనా ప్రశంసలు కురిపించారు. 2008 నుంచే అమిత్ షాతో తనకు పరిచయం ఉందని చెప్పారు. తరచుగా ఆయనను కలుస్తుంటానని..అంతకుమించి అందులో ఏం లేదని క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story