Sri Lankan Navy Firing : భారత మత్స్యకారులపై శ్రీలంక కాల్పులు

చేపలు పట్టేందుకు వెళ్లిన భారతీయ మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం మంగళవారంనాడు కాల్పులు జరపడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కరైకల్, తమిళనాడుకు చెందిన 13మంది మత్స్యకారులు వేటకు వెళ్లగా శ్రీలంక పరిధిలోని డెల్ప్ దీవివద్ద ఆ దేశ నావికాదళం అడ్డగించింది. పడవలో ఉన్నవారిని అరెస్టు చేయబోగా వారు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరి పారు. ఆ కాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని జాఫ్నా లోని టీచింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మిగతావారిని కస్టడీలోకి తీసుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. కాగా ఈ సంఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్లోని శ్రీలంక రాయబారిని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి సమన్లు ఇచ్చారు. భారతీయ మత్స్యకారులపై కాల్పులు సహించబోమని స్పష్టం చేశారు. కాగా ఇది పొరపాటును జరిగిన సంఘటన అని, మత్స్యకారులను చూసి నేరగాళ్లుగా పొరబడ్డామని శ్రీలంక పేర్కొంది. మరోవైపు కొలంబోలోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com